ఆధ్యాత్మికం :మానవ జన్మ ఎలా వస్తుంది..  జన్మలు ఎన్ని రకాలు? వాటి ప్రత్యేకతలు ఇవే..!

ఆధ్యాత్మికం :మానవ జన్మ ఎలా వస్తుంది..  జన్మలు ఎన్ని రకాలు? వాటి ప్రత్యేకతలు ఇవే..!

అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఉత్తమమైనది. జీవరాశులు చాలా ఉన్నా మానవుడు మాత్రమే మంచి.. చెడు ఆలొచించగలడు.  అందుకే అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది... అసలు ఏ జీవికి జన్మ ఎలా వస్తుంది.  అసలు జన్మలు ఎన్నికరకాలు.. వాటి ప్రత్యేకతలు ఏంటి .. మొదలగు విసయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.  అలా జీవుడు తిరిగి జన్మ ఎత్తుతాడు.  ఇలాంటివి మూడు రకాలైన జన్మలుంటాయని పండితులు చెబుతున్నారు.  అవి 1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.

మానవుడిగా జన్మించిన తరువాత భూలోకంలో అనేక కర్మలను ఆచరిస్తాడు.  వాటి ఫలితంగానే అనేక జన్మల్లో కర్మఫలాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.

 కర్మఫలాల కారణంగా అక్కడ అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కాదు.. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే...మరల మరల మానవ జన్మనో, జంతు జన్మగానో పుట్టవలసి ఉంటుంది. దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి .  కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.

 పాపకర్మల ఫలాలు అన్నీ పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతుజన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదని పురాణాలు చెబుతున్నాయి. 

 పుణ్యపాప కర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.
పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధిని మానవులకు ఉంటుంది.  కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది పండితులు చెబుతున్నారు. 

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను..“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో  తెలియజేశారు. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.

84 లక్షల జన్మల లెక్క ఇదే..! 

  • జలజీవులు – 9 లక్షలు: చేపలు, తాబేళ్లు
  • వృక్షాలు - 20 లక్షలు: చెట్లు, మొక్కలు 
  • కీటకాలు - 11 లక్షలు: చీమ, ఈగ, దోమ
  • పక్షులు - 10 లక్షలు: కాకి, చిలుక, నెమలి
  • పశువులు - 30 లక్షలు: ఆవు, మేక, సింహం
  • మానవులు - 4 లక్షలు:  మోక్ష మార్గానికి చివరి మెట్టు
     

గీతలో కృష్ణుడు చెప్పాడు - "మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే" - వేలమందిలో ఒక్కడే మోక్షానికి ప్రయత్నిస్తాడు. అందుకే మానవ జన్మ వచ్చింది అంటే దేవతలు కూడా అసూయపడతారు. ఎందుకంటే మోక్షం మనిషికి మాత్రమే సాధ్యం.కాబట్టి ఈ జన్మను వృధా చేయకుండా ధర్మం, దానం, దైవచింతనతో గడపాలి  కదామరి..!