ఫైర్ ఎన్‌‌వోసీల పేరిట మోసం చేస్తే కఠిన చర్యల : డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌ 

ఫైర్ ఎన్‌‌వోసీల పేరిట మోసం చేస్తే కఠిన చర్యల : డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌ 
  • ఫైర్  సేఫ్టీలో రాజీపడొద్దు
  • నకిలీ ఎన్‌‌వోసీలతో మోసపోవద్దు
  • విద్యాసంస్థల సంఘాలతో ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: అగ్నిమాపకశాఖ ఎన్‌‌వోసీ(నో అబ్జెక‌‌్షన్‌‌ సర్టిఫికెట్‌‌)లు ఇప్పిస్తామని హామీ ఇచ్చే అనధికార వ్యక్తులు, మోసపూరిత వ్యక్తుల బారిన పడొద్దని విద్యా సంస్థల యాజమాన్యాలను తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫైర్‌‌  ఎన్‌‌వోసీలు పొందేందుకు ప్రయత్నిస్తే సమస్యలు వస్తాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలలు, జూనియర్‌‌ కాలేజీల నిర్వాహకులు ఫైర్​ సేఫ్టీ రూల్స్​ తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు.

విద్యా సంస్థల్లో అగ్నిమాపక భద్రతా అవసరాలు, ఫైర్‌‌ నో అబ్జెక్షన్‌‌ సర్టిఫికెట్ల జారీపై స్పష్టత కల్పించేందుకు మంగళవారం  తెలంగాణ ఫైర్‌‌ సర్వీసెస్‌‌ డీజీ ఆఫీస్​లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ స్కూళ్లు, జూనియర్‌‌ కాలేజీల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫైర్‌‌ సేఫ్టీ వ్యవస్థలు నిరంతరం పని చేసేలా క్రమం తప్పకుండా మెయింటెనెన్స్​ చేపట్టాలన్నారు.

ఇప్పటికే నిర్మించిన భవనాల్లో మార్పులు చేయడం సాధ్యం కాని పక్షంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో చెక్​లిస్ట్​ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల దరఖాస్తులను ఒకే విధంగా పరిశీలించేలా చెక్‌‌లిస్ట్‌‌, విధానం రూపొందించడంపై చర్చించారు. నకిలీ ఫైర్‌‌ ఎన్‌‌వోసీల తయారీ, ఫోర్జరీ, అనధికారిక ఎన్‌‌వోసీల అందజేయడాన్ని అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడంపై చర్చించారు.