ఒక్క శాతం పోలీసుల తప్పుల వల్లే డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు..: డీజీపీ అంజనీకుమార్

ఒక్క శాతం పోలీసుల తప్పుల వల్లే  డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు..: డీజీపీ అంజనీకుమార్

హైదరాబాద్‌‌, వెలుగు:  విధి నిర్వహణలో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటిని ప్రొఫెషనల్ స్కిల్స్ తో అధిగమించాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ఒక్క శాతం పోలీసులు చేసే తప్పులు డిపార్ట్‌‌మెంట్‌‌ పరువు తీస్తున్నాయని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ నుంచి అవార్డులు అందుకున్న 38 మంది పోలీస్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర పోలీసులు 50 నుంచి 70 మెడల్స్‌‌ సాధించడం గర్వకారణమని చెప్పారు. అయితే, డిపార్ట్‌‌మెంట్‌‌లో ఒక్క శాతం మంది అధికారులు చేస్తున్న తప్పుల వల్ల టాప్‌‌ లెవల్‌‌ నుంచి కిందకు పడిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. పోలీసులు చేసే తప్పులను మీడియా, సోషల్‌‌మీడియాలో ప్రజలు ఎండగడతారని హెచ్చరించారు. సామాన్యుడికి న్యాయం చేసేలా నిబద్ధతో పనిచేయాలని చెప్పారు.