
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ జితేందర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వీడ్కోలు సభలో తల్లిదండ్రులను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. డీజేపీ జితేందర్ పదవి విరమణ సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 30) తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీసుశాఖ ఫేర్‌వెల్‌డే కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్గా మా తండ్రి చనిపోయారని.. దీంతో తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయానని కంటతడి పెట్టుకున్నారు. ఉద్యోగ రీత్యా ఫ్యామిలీ, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని.. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని అన్నారు. తనను అర్థం చేసుకుని సహకరించిన తన భార్య, పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు.
పంజాబ్‌లో పుట్టి పెరిగిన తాను.. గత 33 సంవత్సరాలుగా ఏపీ, తెలంగాణలో కీలక పదవుల్లో పని చేశానని తెలిపారు.
పోలీస్ శాఖలో ఉండి ప్రజలకి సేవ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవమన్నారు. నా 40 ఏళ్ల జీవితం 40 రోజుల్లా గడిచిపోయిందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
రాష్ట్రంలో గత 15 నెలల్లో లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్, నేరాలు అదుపులో ఉన్నాయని.. నక్సలిజం, టెర్రరిజం నుంచి ప్రజలకు రక్షణ కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని అదే విధంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, శ్రీరామ నవమి, బక్రీద్ వంటి పండగల్లో చిన్న తప్పిదం లేకుండా నిర్వహించామని పేర్కొన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ కేవలం తెలంగాణ ప్రజల కోసమే కాకుండా ఇతర రాష్ట్రాల కోసం కూడా పని చేసిందని.. ఇతర రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను అరెస్ట్ చేయడం, సైబర్ నేరగాళ్లని పట్టుకోవడం, ఆర్థిక నేరాలు చేసే వారిని అరెస్ట్ చేయడమే ఇందుకు సాక్ష్యమన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని.. శాంతి భద్రతలు కాపాడటంలో ఎప్పుడు ముందుంటారని కొనియాడారు.
దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో పోలీసులకు సవాల్‌గా మారాయని.. అయినప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకుని కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని అన్నారు.
తెలంగాణ కొత్త డీజీపీగా నియామకమైన శివధర్ రెడ్డి ఆ పదవికి అర్హుడని అన్నారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని.. ఎన్నో ఏళ్ళు పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో కలిసి పని చేశామని గుర్తు చేశారు. శివధర్ రెడ్డి సేవలు తెలంగాణ ప్రజలకి ఎంత గానో ఉపయోగపడతాయని అన్నారు.