కామారెడ్డిలో వరదలు తగ్గాయి.. 1200 మందిని కాపాడాం: డీజీపీ జితేందర్

కామారెడ్డిలో వరదలు తగ్గాయి.. 1200 మందిని కాపాడాం: డీజీపీ జితేందర్

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు, వరదలపై డీజీపీ జితేందర్ కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉందన్నారు. కామారెడ్డి, రామాయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గిందని తెలిపారు. పోలీసులు 24 గంటలు రెస్క్యూ టీమ్స్ తో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

 వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నామని, ఇప్పటి వరకు 1200 మందిని కాపాడామని తెలిపారు. జలమయమైన కామారెడ్డిలో చాలా మందిని రక్షించగలిగామని.. ఎస్డీఆర్ఎఫ్ టీములు సకాలంలో ఘటన స్థలానికి చేరుకోవడంతో భారీ ముప్పు తప్పిందన్నారు.

బుధవారం (ఆగస్ట్ 27) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలను వర్షం ముంచెత్తింది. ఈ రెండు జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. కుండపోత వానతో మెదక్, కామారెడ్డి జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని గ్రామాలకు గ్రామాలే జల దిగ్భంధం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎడతెరిపిలేని వర్షం, ఉప్పొంగి ప్రవహిస్తోన్న వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్య్కూ టీములతో కలిసి పోలీసులు సహయక చర్యలు చేపట్టారు.