బేసిక్ పోలీసింగ్ను మరవొద్దు.. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ గా ఉండాలి: పోలీసులకు డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డి సూచన

బేసిక్ పోలీసింగ్ను మరవొద్దు.. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ గా ఉండాలి: పోలీసులకు డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డి సూచన
  • సీపీలు, ఎస్పీలతో తొలి సమావేశం
  • అవినీతి, నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని స్పష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్‌‌ ను మరువకూడదని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ‘ఫెయిర్, ఫర్మ్‌‌, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్‌‌ పోలిసింగ్‌‌’  ఫార్ములాతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ‘ఫెయిర్ పోలీసింగ్‌‌’ అంటే చట్టం ముందు అందరూ సమానమేనని, నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.  పక్షపాతం లేకుండా చట్టాలు అమలు చేయడం, శాంతిభద్రతల నిర్వహణ కోసం ‘ఫర్మ్  పోలీసింగ్’, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ‘ఫ్రెండ్లీ పోలిసింగ్‌‌’ నిర్వహించాలని ఆదేశించారు. 

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలీస్  కమిషనర్లు, జిల్లాల ఎస్‌‌పీలతో డీజీపీ గురువారం మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌‌లో బేసిక్ పోలీసింగ్‌‌  సహా నేరాల నియంత్రణపై గంటన్నర పాటు దిశానిర్దేశం చేశారు. స్కిల్‌‌, క్రమశిక్షణ, జవాబుదారీతనంతో కూడిన ‘ప్రొఫెషనల్  పోలిసింగ్’ నిర్వహించాలన్నారు.  ‘‘తెలంగాణ పోలీసుల వెన్నుముకగా బేసిక్ పోలిసింగ్ ఉండాలి. బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలిసింగ్, నిఘా, అత్యవసర స్పందన, నేరాల నియంత్రణ, పబ్లిక్  ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలిసింగ్‌‌ నిర్వహించాలి. 

బేసిక్  పోలిసింగ్‌‌లో   నేర గణాంకాల ద్వారా మాత్రమే కాక ప్రజల విశ్వాసం, నమ్మకం, సంతృప్తి సంపాదించాలి. ఇన్నొవేషన్, ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్‌‌తో నేరాల నివారణపై అవగాహన మెరుగుపడుతుంది. అధికారులు నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలి. అవినీతి, నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదు” అని డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డి పేర్కొన్నారు. 

హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలి

రాష్ట్రంలో ఏటా సగటున 900 హత్యలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున 8,000 మరణాలు సంభవిస్తున్నాయని డీజీపీ తెలిపారు. వీటిని అత్యంత తీవ్రమైన అంశాలుగా గుర్తించాలని,  వీటి నివారణపై దృష్టి సారించాలని సూచించారు. ‘‘రాత్రి పెట్రోలింగ్, డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌  తనిఖీలు, రోడ్‌‌  సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి. తీవ్రమైన ప్రమాదాలను ఆన్-సైట్  తనిఖీ చేసి ఆయా కారణల విశ్లేషణ, దిద్దుబాటు చర్య ట్రాకింగ్‌‌తో సమీక్షించాలి. 

మహిళలు, పిల్లలు, బలహీన వర్గాలపై జరిగే నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్  నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు పోలిసింగ్‌‌లో ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలి” అని డీజీపీ సూచించారు.