అండర్ గ్రౌండ్ మావోయిస్టు అగ్రనేతలు, కేడర్ జనజీవన స్రవంతిలోకి రావాలి: డీజీపీ శివధర్ రెడ్డి

అండర్ గ్రౌండ్ మావోయిస్టు అగ్రనేతలు, కేడర్ జనజీవన స్రవంతిలోకి రావాలి: డీజీపీ శివధర్ రెడ్డి

అండర్ గ్రౌండ్ మావోయిస్టు అగ్రనేతలు, కేడర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకు అండర్ గ్రౌండ్ మావోయిస్టు అగ్రనేతలు, కేడర్ జనజీవన స్రవంతిలోకి రావాలని అన్నారు. శాంతియుతంగా, భద్రంగా, గౌరవప్రదంగా తమ కుటుంబాలతో జీవించాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసుల కృషితో 588 మంది మావోయిస్టు నేతలు, కేడర్లు లొంగిపోయి సాధారణ జీవితంలోకి చేరినట్లు వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టులందరూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ ప్రయోజనాలు పొందారని స్పష్టం చేశారు డీజీపీ. ప్రస్తుతం వారు తమ స్వగ్రామాల్లో కుటుంబాలతో సురక్షితంగా, సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. ఈ పునరావాస విధానం ఇస్తున్న సానుకూల ఫలితాల వల్ల ఇతర రాష్ట్రాల అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారని అన్నారు శివధర్ రెడ్డి. ఇది తెలంగాణ ప్రభుత్వ పునరావాస కార్యక్రమాల విశ్వసనీయత, దయ, సమర్థతను చాటుతోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిగిలిన 15 మంది అండర్‌గ్రౌండ్ కేడర్లు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. లొంగిపోయే వారికి వెంటనే సహాయం, పునరావాస పథకాల కింద అన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర పునరావాసం ద్వారా గ్రామం, పట్టణంలో స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు డీజీపీ. 

మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతియుత, నిర్మాణాత్మక మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కుటుంబాలతో మళ్లీ కలసి, తెలంగాణ అభివృద్ధికి సానుకూలంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు డీజీపీ శివధర్ రెడ్డి.