బతికున్నవారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.. దమ్మపేట తహసీల్దార్, జీపీఓ సస్పెన్షన్

బతికున్నవారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.. దమ్మపేట తహసీల్దార్, జీపీఓ సస్పెన్షన్

దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేశ్, పెద్దగొల్లగూడెం జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అంకిత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మళ్లా సత్యం బతికే ఉన్నప్పటికీ, ఆయన మృతిచెందినట్లు చూపించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 సత్యంకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ, ఒక్క కుమార్తె నామా పుష్పావతే వారసురాలిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రం జారీ చేసి, గ్రామంలోని ఐదు ఎకరాల అసైన్డ్ భూమి రికార్డులను అక్రమంగా మార్చినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై విచారణకు కొత్తగూడెం ఆర్డీవో మధును కలెక్టర్ నియమించారు. ఆర్డీవో సమర్పించిన నివేదిక ఆధారంగా తహసీల్దార్ రామ్ నరేశ్, జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేశారు. దమ్మపేట తహసీల్దార్‌‌‌‌గా గ్రూప్-1 ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని నియమిస్తూ బాధ్యతలు  అప్పగించారు.