బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో ఘటన

బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో ఘటన

కూసుమంచి, వెలుగు: తులం బంగారం కోసం దుండగులు వృద్ధురాలిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో చెన్నా జనార్దన్, సుగుణమ్మ(66) దంపతులు జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. 

జనార్దన్ పక్షవాతంతో మంచానికే పరిమితయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు తట్టగా, సుగుణమ్మ తలుపు తీసింది. వెంటనే పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత మెడలో ఉన్న తులం బంగారు గొలుసు తీసుకుని పరారయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జనార్దన్ గమనించి కేకలు వేయడంతో సమీపంలోని దుకాణ యజమాని వచ్చి చూడగా సుగుణమ్మ రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. 

ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్‌‌‌‌ఐ జగదీశ్​ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.

నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి..


వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు మండలం కడేగల్(దుబ్బగూడెం) గ్రామంలో ఓ వ్యక్తిని నిద్రలోనే కత్తులతో దాడి చేసి హత్య చేశారు. గ్రామానికి చెందిన మడే చలపతి(35) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. గొంతు కోసి చంపేసి పరారయ్యారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్  తెలిపారు.