పోడు భూముల వివాదం.. ఆఫీసర్లు, గిరిజనుల మధ్య ఘర్షణ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

పోడు భూముల వివాదం.. ఆఫీసర్లు, గిరిజనుల మధ్య ఘర్షణ..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • మహిళా బీట్​ ఆఫీసర్, ముగ్గురు గిరిజనులకు గాయాలు

మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామంలో పోడు భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మనుబోతులపాడు సెక్షన్‌‌‌‌లోని రేగులగండి బీట్ పరిధిలో గిరిజనులు అడవిని నరికి పోడు సాగు ప్రారంభించినట్లు అధికారులకు తెలిసింది. 

మణుగూరు రేంజ్ ఆఫీసర్ ఉపేందర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది జేసీబీలతో ట్రెంచ్ తవ్వేందుకు వెళ్లగా, స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో జరిగిన తోపులాటలో ముగ్గురు గిరిజన మహిళలతో పాటు ఓ మహిళా బీట్ ఆఫీసర్ గాయపడ్డారు. ఫారెస్ట్ అధికారులు మహిళలపై దాడి చేశారని గిరిజనులు ఆరోపించారు. అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. 

కాగా, తాము గొడవను అడ్డుకునే ప్రయత్నంలోనే స్వల్ప గాయాలయ్యాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎఫ్‌‌‌‌డీఓ బాబు మాట్లాడుతూ.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌‌‌‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెలలోనే స్థానికుల సమక్షంలో హద్దులు గుర్తించామని, శుక్రవారం పనులు జరుగుతుండగా కొందరు మహిళలు యూనిఫాంలో ఉన్న సిబ్బందిపై దాడికి  యత్నించారన్నారు.