విద్య ప్రజాస్వామికీకరణ కోసం .. ధర్మ టీచర్ యూనియన్

విద్య ప్రజాస్వామికీకరణ కోసం .. ధర్మ టీచర్ యూనియన్

విద్యార్థుల వికాసం ఉపాధ్యాయుడితోనే ముడిపడి ఉంటుంది. సమాజ మార్పునకు పునాదులు వేసి, సామాజిక బాధ్యత కలిగిన గొప్ప వ్యక్తి గురువు. విద్యార్థి భవిష్యత్ మార్గ నిర్దేశంలో ఉపాధ్యాయుడు క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. అంతేకాకుండా ఇతని ఆలోచనలు, అభిప్రాయాలు, సైద్ధాంతిక భావాలు నిత్యం విద్యార్థిని ప్రభావితం చేస్తాయి. ఒకప్పుడు ఈ దేశంలో అట్టడుగు, ఆణగారిన కులాలకు విద్యలేదు. దీంతో కోట్లాది ప్రజలు చైతన్యరహితులై విముక్తి కాలేకపోయారు. మరోవైపు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అనేక సామాజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడేవారు. 

ఇలాంటి క్లిష్ట సమయంలో విద్య ఉద్యమానికి కృషి చేసిన మొట్టమొదటి సామాజిక విప్లవ జ్యోతులు జ్యోతిబాఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయి ఫూలే. వారి త్యాగాలు నేడు ఈ దేశంలో కోట్లాది బాలల భవితకు బంగారు బాటలు వేశాయి. ఆ తరువాత ఆధునిక భారతదేశంలో విద్యను ప్రజాస్వామికీకరణ చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన అంబేద్కర్​ అందరికీ విద్యను అందించాలని గట్టి ప్రయత్నం చేశాడు. తమకు విముక్తి కల్పించిన ఈ మహనీయుల స్ఫూర్తి పాఠాలు, పోరాటాలు, రాజ్యాంగ విలువలు నేటి తరం విద్యార్థులకు తెలియడం లేదు. ఈ సత్యాన్ని ఉపాధ్యాయులు సైతం తెలుసుకోలేకపోతున్నారు. 

ఈనేపథ్యంలో విశాల దృక్పథం కలిగి, మహనీయుల ఆలోచనలతో విద్యారంగ సమస్యలపై గళమెత్తే ఉపాధ్యాయ సంఘం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా నేడు మన విద్యావ్యవస్థలో 20వ శతాబ్ద ప్రధాన విద్యా సంస్కర్త అయినా జాన్ డ్యూయీ ప్రగతిశీల విద్య, ఉదారవాద ఆదర్శాలు మనకు అవసరం. ధర్మమార్గంలో పయనించాలని సూచిస్తూ సామాజిక రుగ్మతలు పారదోలి సత్యాన్వేషణే లక్ష్యంగా ముందుకు నడిపించిన గొప్ప సంఘ సంస్కర్త గౌతమ బుద్దుడి మార్గం తెలుసుకోవాలి. ఈ మార్గంలో నడవడానికి తెలంగాణ రాష్ట్రంలో నూతన ఉపాధ్యాయ సంఘంగా ధర్మ టీచర్ యూనియన్ ముందుకు వచ్చింది. 

విద్యాభివృద్ధికి మహనీయుల త్యాగాలు

విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుల త్యాగాలు, రాజ్యాంగం విలువలు తెలియక కొన్ని తరాలు అంధకారపు ఆలోచనలతో నిండుకున్నాయి. ఈ సత్యాన్ని బాల్య దశ నుంచి బోధించి,  విజ్ఞానం వైపు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ వర్గం మీదనే ఉన్నది. ఉపాధ్యాయుల సేవాకాలంలో ఈ ప్రయత్నం జరగాలి. లేదంటే భావి పౌర సమాజం తప్పుడు మార్గంలో నడుస్తుంది. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పేద, బడుగు, బలహీనులు విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు సైతం అనేక  సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 ఈ విధంగా విద్యారంగ సమస్యలనే కాక ఉపాధ్యాయ సమస్యలు సైతం పరిష్కరించాలి. ప్రస్తుతం విద్యారంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉపాధ్యాయులే మెజార్టీగా పనిచేస్తున్నారు. వీళ్లందరికీ ఈ వృత్తి భారత రాజ్యాంగం ద్వారా లభించిన గొప్ప ఫలమే అని మరిచిపోవద్దు. ఉపాధ్యాయులను బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్ భావజాలంతో నడిపిస్తూ, భారత రాజ్యాంగ కల్పించిన హక్కులతో విద్యా రంగ సమస్యలను పరిష్కరించడానికి ధర్మ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆదర్శ దంపతులైన జ్యోతిబాఫూలే,  సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ, విద్యను ప్రజాస్వామికీకరించాలని యుద్ధం చేయనుంది.

- సంపతి రమేష్ మహరాజ్ ధర్మ టీచర్ యూనియన్ సభ్యుడు