మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం : ధర్మపురి అర్వింద్

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం : ధర్మపురి అర్వింద్

ఆర్మూర్, వెలుగు: అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి  అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్​లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్ లో సోమవారం కొమరంభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉందని, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో, వచ్చేసారి ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందన్నారు. 

గత పార్లమెంట్​ఎన్నికల్లోనూ ఆర్మూర్​ఓటర్లు తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. గత పార్లమెంట్ ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని, పసుపు బోర్డు తీసుకురావడమే కాకుండా, రూ.20 వేల ధర అందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

 కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి, పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి, ఆర్మూర్ ప్రభారి నందకుమార్, మున్సిపల్  మాజీ  చైర్మన్ కంచెట్టి గంగాధర్, పుప్పాల శివరాజ్, జీవీ నర్సింహారెడ్డి, యామాద్రి భాస్కర్, మారంపల్లి గంగాధర్, పాలెపు రాజు, అమ్దాపూర్​ రాజేశ్వర్​ పాల్గొన్నారు.