ఎప్పటికీ జనం మెచ్చిన సూపర్ స్టార్.. బాలీవుడ్ హీ -మ్యాన్ ధర్మేంద్ర

ఎప్పటికీ జనం మెచ్చిన సూపర్ స్టార్..  బాలీవుడ్  హీ -మ్యాన్ ధర్మేంద్ర

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన బాలీవుడ్‌‌‌‌  హీ మ్యాన్‌‌‌‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. 

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా  పంజాబ్‌‌‌‌లోని కుగ్రామం నుంచి వచ్చి, అవకాశాల కోసం ఎన్నో అవాంతరాలను అధిగమించి అసాధారణ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన ధర్మేంద్ర ఎందరికో స్ఫూర్తి. కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకుని, బాలీవుడ్‌‌‌‌ టాప్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌గా రాణించి, ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగడం ఆయనకే సాధ్యమైంది. ఒకప్పటి యూత్‌‌‌‌కు నచ్చిన యాక్షన్‌‌‌‌ హీరో..  అప్పట్లో అమ్మాయిలు మెచ్చిన హ్యాండ్‌‌‌‌సమ్ హీరో.. ఆపై అభిమానులకు హీమ్యాన్.. ఎప్పటికీ  జనం మెచ్చిన సూపర్ స్టార్.. ధర్మేంద్ర. 

ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్‌‌‌‌ క్రిషన్‌‌‌‌ డియోల్. పంజాబ్‌‌‌‌లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న పుట్టారు. దిలీప్ కుమార్‌‌‌‌‌‌‌‌ సినిమాల స్ఫూర్తితో నటుడు అవ్వాలనుకున్నారు. కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో  చిన్న పాత్రల్లో కనిపించారు. 1960లో వచ్చిన ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’ చిత్రంతో ఆయన సినీ కెరీర్‌‌‌‌‌‌‌‌ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘షోలా ఔర్ షబ్నమ్‌‌‌‌’తో గుర్తింపును అందుకున్నారు. 1962లో వచ్చిన ‘హఖీఖత్‌‌‌‌’ చిత్రంతో చక్కని విజయాన్ని దక్కించుకున్నారు.  1965లో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘కాజల్‌‌‌‌’తో మరో సూపర్ హిట్ అందుకున్నారు. 1966లో వచ్చిన ‘పూల్ ఔర్‌‌‌‌‌‌‌‌ పత్తర్‌‌‌‌‌‌‌‌’ తర్వాత ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో బాలీవుడ్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోగా రాణించారు.   

హ్యాండ్‌‌‌‌సమ్ యాక్షన్ హీరో

బాలీవుడ్‌‌‌‌ హీరోల్లో చాలామంది హ్యాండ్‌‌‌‌సమ్ హీరోలున్నారు కానీ ఆ టైటిల్‌‌‌‌తో పాపులర్‌‌‌‌‌‌‌‌ అయింది మాత్రం ధర్మేంద్ర మాత్రమే. 1965 నుంచి 1980 వరకూ హిందీ సినిమా ఇండస్ట్రీని శాసించారు ధర్మేంద్ర. ఒకే ఏడాదిలో ఏడు సూపర్ హిట్స్‌‌‌‌ అందుకున్న హిస్టరీ ఆయన సొంతం. చుప్కే చుప్కే, అలీబాబా ఔర్ 40 చోర్,  ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కీ బారాత్, దోస్త్,  డ్రీమ్ గర్ల్‌‌‌‌, సన్నీ, గాయల్, లోఫర్‌‌‌‌‌‌‌‌, మేరా నామ్ జోకర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ఆరాధ్య  దైవంగా మారారు ధర్మేంద్ర. ‘షోలే’ లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల  హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కండలు తిరిగిన శరీరం,  రగ్గడ్ లుక్స్‌‌‌‌తో పూర్తి స్థాయి యాక్షన్ స్టార్‌‌‌‌గానూ  గుర్తింపు పొందారు. 1960 నుంచి 70 వరకు ధైర్య సాహసాలు ప్రదర్శించే యాక్షన్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో ఆయన ఎక్కువగా నటించారు.  ఆపై రొమాంటిక్ రోల్స్‌‌‌‌తోనూ మెప్పించారు. ముఖ్యంగా హేమామాలినితో ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ‘చాచు మామా’ లాంటి కొన్ని చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌‌‌‌తోనూ నవ్వించారు ధర్మేంద్ర.  స్క్రీన్‌‌‌‌పై ఆయన మాస్‌‌‌‌ అప్పీల్, పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ డైలాగ్ డిక్షన్‌‌‌‌, అద్భుతమైన స్టైల్‌‌‌‌తో ప్రేక్షకులు ఆయనకు ‘హీ మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బాలీవుడ్‌‌‌‌’ బిరుదును ఇచ్చారు. 

పద్మభూషణ్‌‌‌‌

సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2012లో పద్మభూషణ్‌‌‌‌ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అలాగే ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. 2004లో రాజస్థాన్‌‌‌‌లోని బికనీర్ లోక్‌‌‌‌ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. 

ధర్మేంద్ర నటవారసత్వం

బాలీవుడ్ హీమ్యాన్‌‌‌‌ ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన కొడుకు బాబీ డియోల్,  సన్నీడియోల్ కొనసాగిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే 19 ఏళ్ల వయసులో ప్రకాష్ కౌర్‌‌‌‌‌‌‌‌ను పెండ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. వారికి కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌‌‌‌తో పాటు కూతుర్లు విజేత, అజీత సంతానం. సినిమాల్లోకి వచ్చాక 1980లో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినిని  ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఈషా డియోల్, అహానా డియోల్ సంతానం. ఈషా డియోల్ హీరోయిన్‌‌‌‌గా పలు సినిమాలు చేయగా, అహనా అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. 

చివరివరకూ నటిస్తూ..

గత ఏడాది విడుదలైన ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్‌‌‌‌లతో కలిసి నటించారు ధర్మేంద్ర.అమితాబ్ మనవడు అగస్త్యా నందా హీరోగా పరిచయం అవుతున్న ‘ఇక్కీస్‌‌‌‌’ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సోమవారం ఉదయం ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. పరమ వీర చక్ర అవార్డు గ్రహీతలలో అత్యంత చిన్న వయస్కుడైన అరుణ్ ఖేతర్‌‌‌‌పాల్ జీవితం ఆధారంగా శ్రీరామ్ రాఘవన్ దీన్ని రూపొందిస్తున్నారు.