న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ ఒక అధ్యాయాన్ని ప్రచురించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఇష్యూను సుమోటోగా తీసుకుని విచారణ మొదలుపెట్టింది.
ఎన్సీఈఆర్టీ ప్రచురించిన 8వ తరగతి సోషల్ సైన్స్ బుక్ ప్రచురణ, అమ్మకాలను నిషేధించింది. న్యాయవ్యవస్థను అపహాస్యం చేసేలా పుస్తకంలో సెలబస్ పెట్టడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్సీఈఆర్టీ బుక్ వివాదంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
గురువారం (ఫిబ్రవరి 26) జంషెడ్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఎన్సీఈఆర్టీ ఆదేశించానని తెలిపారు. న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి అస్సలు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఈ ఇష్యూపై విచారణ జరుగుతుందని తెలిపారు.
జరిగిన దానికి చాలా బాధపడ్డానని.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. వివాదస్పదం అవుతోన్న చాప్టర్‌ను రూపొందించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం మా రాజ్యాంగబద్ధమైన నైతిక బాధ్యత అని అన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
