న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్, పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మద్దతు నిలిచింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ధర్మేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయంపై శనివారం స్పందించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలు, విద్యా వ్యవస్థ ఆధునికీకరణ, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
ప్రజా జీవితంలో నిజాయితీ, బాధ్యతాయుత వైఖరికి నిదర్శనంగా దేశ ప్రయోజనాలను ముందుంచి ఆయన రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంలో బీజేపీ పూర్తిగా ఆయనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ఆయన ప్రజాసేవ కొనసాగాలని ఆకాంక్షించారు.
కాగా, ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు కూడా స్పందించారు. దేశ విద్యా రంగంలో ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం అమలు, విద్యా రంగంలో చే పట్టిన మార్పులు చిరకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. దేశ, స్టూడెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఆయన బాధ్యతాయుత నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
