కేసీఆర్​ మారడు..ఆయన్నే మార్చాలి

కేసీఆర్​ మారడు..ఆయన్నే మార్చాలి
  • మీరంతా అనుకుంటే అది కష్టమేం కాదు 
  • బీఆర్ఎస్​ అంటే భస్మాసుర సమితి 
  • సర్పంచుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యత
  • చనిపోయిన సర్పంచుల కుటుంబాలకు చెరో కోటి ఇవ్వాలి
  • కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకే పంచాయతీ నిధుల దారి మళ్లింపు
  • సర్పంచుల ధర్నాలో రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సర్పంచుల దుస్థితికి, వాళ్ల ఆత్మహత్యలకు సర్కారే కారణమని.. ఆ పరిస్థితికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. చనిపోయిన సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్​ చేశారు. సోమవారం ఇందిరాపార్క్​ వద్ద కాంగ్రెస్​ అనుబంధ విభాగం రాజీవ్​ పంచాయతీరాజ్​ సంఘటన్​ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రేవంత్​మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్​సర్కారు పక్కదారి పట్టించి పంచాయతీల్లో పైసా లేకుండా చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ కారణాలతో 60 మంది సర్పంచులు చనిపోయారని పేర్కొన్నారు. సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేలా పురికొల్పింది కేసీఆరేనని రేవంత్​ ఆరోపించారు. ‘‘ కేసీఆర్​కు వ్యతిరేకంగా తిరగబడాల్సిన సమయం వచ్చింది. కేసీఆర్​ మారడు. ఆయన్నే మార్చాల్చిన పరిస్థితి వచ్చింది. సర్పంచులంతా తల్చుకుంటే అదేం పెద్ద పని కాదు” అని ఆయన కామెంట్​ చేశారు. పంచాయతీలకు అందాల్సిన నిధులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కేసీఆర్​ దారి మళ్లించారని మండిపడ్డారు. ‘‘గ్రామాల్లో ఒక్క చెట్టు చనిపోయినా సర్పంచును సస్పెండ్​ చేయాలని అంటున్నారు. మరి మూసీలో 30 మంది చనిపోయినా.. జవహర్​నగర్​డంపింగ్​ యార్ట్​ కంపు గొట్టి పరిసరాలు కాలుష్యమయం అవుతున్నా.. సిటీ అంతా చెత్తతో నిండిపోయినా పట్టించుకోని మున్సిపల్​ మంత్రి కేటీఆర్​ను ఏం చేయాలి? ” అని రేవంత్​ ప్రశ్నించారు. బీఆర్ఎస్​ అంటే ‘భస్మాసుర సమితి’  అని ఎద్దేవా చేశారు.  భస్మాసురుడిలాగా కేసీఆర్ ఓవరాక్షన్​ చేసి భస్మమైపోతారని కామెంట్​ చేశారు. ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి మాట్లాడుతూ.. ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీలకు ఇచ్చే నిధులను కూడా కేసీఆర్​ సర్కారు విడుదల చేయడం లేదన్నారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్ముతో ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు పొందే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ ఆరోపించారు. నిధులు లేకపోతే గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుందని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ధర్నాకు సోమవారం అనుమతి ఉన్నా.. జిల్లాల్లో కాంగ్రెస్​ నేతల్ని అరెస్టు చేశారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్​ పంచాయతీరాజ్​వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని కిసాన్​ సెల్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి  అన్నారు. సర్పంచులకు అందాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులను సీఎం కేసీఆర్​  దొంగిలించారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​​ కుమార్​ చెప్పారు.

పోలీస్​ అభ్యర్థులకు అండగా ఉంటాం:  రేవంత్​ 

పోలీసు అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలుస్తామన్నారు. సోమవారం ధర్నా చౌక్​లో రేవంత్​ను ఎస్ఐ, కానిస్టేబుల్​ సమస్యల పరిష్కార పోరాట సమితి సభ్యులు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రేవంత్ స్పందిస్తూ.. తెలంగాణ అధికారులను కేసీఆర్​ నమ్మట్లేదని, ఇది ఇక్కడి ప్రజలకు అవమానకరమన్నారు. నియామకాలు సరైన రీతిలో చేపట్టకపోతే కేసీఆర్​ ఉద్యోగం ఊడడం ఖాయమని రేవంత్​ కామెంట్​ చేశారు. 

అభివృద్ధి పనులకు పైసలిస్తలేరు

గ్రామంలో అభివృద్ధి పనులకు పైసలిస్తలేరు. అప్పులు తీర్చేందుకు ఆస్తులు కుదువపెట్టాల్సి వచ్చింది. పైసలు లేకుంటే గ్రామంలో శానిటేషన్​ పనులెట్లా చేయాలె. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనం, క్రీడా మైదానం కట్టమని గ్రామస్తులు ఒత్తిడి చేస్తున్నారు.  ఇవన్నీ ఎట్ల చేయాలె ?  సర్పంచుల పరిస్థితిని చూసి.. మళ్లా ఎవరైనా నిలబడాలంటే భయపడుతుండ్రు.
‑ శ్రీకాంత్ రెడ్డి, సోలక్ పల్లి గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లా

ట్రాక్టర్​ కిస్తీ కట్టలేకపోతున్నం

మా గ్రామంలో శ్మశాన వాటిక కట్టి రెండున్నర సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ పైసలు రాలే... అక్కడ ఇక్కడ నిధులు తెచ్చి కట్టారు.. ఇప్పుడేమో నన్ను గట్టిగా పట్టుకుంటున్నారు. నేనేం చేయాలి. మా చిన్న గ్రామపంచాయతీకి ట్రాక్టర్ తీసుకున్నాం. నిధులు లేకపోవడంతో ట్రాక్టర్​కిస్తీ కట్టలేకపోతున్నాం. మా గోస ఎవరికీ రావద్దు.
‑ రేపల్లె సత్యనారాయణ గౌడ్, భీమ్ రాజు పల్లి గ్రామం, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా

డిజిటల్​ కీతో మోసం చేసిండ్రు 

రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీని తీసుకొచ్చి సర్పంచులను మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తే, డిజిటల్ కీ ద్వారా అర్ధరాత్రి పూట నిధులను దారి మళ్లించుకున్నారు. నిధులు ఉన్నాయనుకుంటే  అకౌంట్​ ఫ్రీజ్​చేసి పెట్టారు. ఇది మా హక్కులను పూర్తిగా కాలరాయడమే అవుతుంది. సర్పంచ్​ వ్యవస్థను సర్కారు నాశనం పట్టించింది.
‑ గేరెడ్డి మహేందర్ రెడ్డి, పోచన్ పేట గ్రామం, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా