ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని రాస్తారోకో

ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని రాస్తారోకో

హసన్ పర్తి, వెలుగు:  పంట సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండలం శంభునిపల్లి, అంబాల, శనిగరం, పెరికపల్లి, మాదన్నపేట, లక్ష్మీపురం, నేరెళ్ల, గూడూరు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు హసన్ పర్తి మండలం అనంతసాగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శనిగరం, నేరెళ్ల, గూడూరు, అంబాల తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి, మక్కజొన్న పంటలు చివరి దశలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పంట సాగుకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోరినా ఫలితం లేదని వాపోయారు. ఇరిగేషన్ ఆఫీసర్లను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు వాగులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో హసన్ పర్తి-- కరీంనగర్ జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న హసన్ పర్తి సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని నీటిని విడుదల చేసేలా ఎస్సారెస్పీ ఆఫీసర్లతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో కొమురయ్య, తోట ముత్తయ్య, సాంబయ్య, పోశయ్య, లక్ష్మీపతి, రాజయ్య, లింగమూర్తి పాల్గొన్నారు.