రోహిత్ శర్మ సక్సెస్ కు ధోని కారణం

రోహిత్ శర్మ సక్సెస్ కు ధోని కారణం

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: ప్రస్తుత లిమిటెడ్ ఓవర్ క్రికెట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్రేటెస్ట్ ప్లేయర్ అని వెటరన్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. రోహిత్ వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు, 5 వరల్డ్ కప్ హండ్రెడ్స్ కొట్టాడని చెప్పాడు. రోహిత్ సక్సెస్ క్రెడిట్ ఎంఎస్ ధోనీకే దక్కుతుందని గంభీర్ చెప్పాడు. ‘ఇవ్వాళ రోహిత్ ఈ స్థాయిలో ఉండటానికి ధోనీ కారణం. మీరు సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్ మెంట్ గురించి మాట్లాడొచ్చు.. కానీ కెప్టెన్ మద్దతు లేకపోతే ఇవన్నీ యూజ్ లెస్. ప్రతిదీ కెప్టెన్ చేతిలోనే ఉంటుంది. దాదాపు దశాబ్ద కాలం పాటు రోహిత్ శర్మకు ధోనీ అండగా ఉంటూ వచ్చాడు. నాకు తెలిసి ఏ ప్లేయర్ కు కూడా అంత మద్దతు లభించి ఉండకపోవచ్చు’ అని గంభీర్ చెప్పాడు.

ధోనీలా కోహ్లీ, రోహిత్ చేస్తారనుకుంటున్నా
‘రోహిత్ కు ధోని మద్దతు ఇచ్చినట్లుగానే యంగ్ క్రికెటర్లు శుభం గిల్, సంజూ శాంసన్ కు కూడా అలాంటి సపోర్ట్ అవసరం ఉంది. ఇప్పుడు రోహిత్ సీనియర్ కాబట్టి యంగ్ స్టర్స్ కు అతడు మద్దతుగా ఉంటాడని భావిస్తున్నా. ఓ ప్లేయర్ ను ప్రోత్సహిస్తే అద్భుతమైన క్రికెటర్ అవుతాడనే దానికి రోహిత్ శర్మ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంఎస్ ధోనీలో మరో మంచి విషయం ఏంటంటే.. రోహిత్ టీమ్ లో ఉన్నా లేకపోయినా అతడ్ని ధోని ఎప్పుడూ టీమ్ చర్చలో భాగం చేసేవాడు. ధోనీలాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా యంగ్ స్టర్స్ కు ఎదిగే అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నా’ అని గంభీర్ పేర్కొన్నాడు.