డయాబెటిక్ రెటినోపతితో జాగ్రత్త..ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ డా.పద్మజా రాణి

డయాబెటిక్ రెటినోపతితో జాగ్రత్త..ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ డా.పద్మజా రాణి

హైదరాబాద్ సిటీ, వెలుగు: మధుమేహంతో డయాబెటిక్ రెటినోపతి కంటి సమస్య వేగంగా పెరుగుతోందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కల్లం అంజిరెడ్డి క్యాంపస్​విట్రియో రెటినల్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజా రాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ డయాబెటిక్ రెటినోపతి ప్రపంచవ్యాప్తంగా 25 నుంచి 74 ఏండ్ల మధ్య వయస్సు గల వారిలో చూపు కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటన్నారు. 

ఎక్కువ కాలంగా డయాబెటిస్​తో బాధపడుతున్న వారి కంటి వెనుక భాగంలో ఉన్న రెటినాలోని సూక్ష్మ రక్త నాళాల్లో నష్టం ఏర్పడుతుందన్నారు. ఈ రక్త నాళాలు లీక్ అవడం, ఉబ్బడం, రక్తస్రావం జరగడం వల్ల రెటినా ప్రకాశాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. ఫలితంగా చూపు మందగించడం, వంకరగా కనిపించడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. 

సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే శాశ్వత దృష్టి లోపానికి దారి తీస్తుందన్నారు. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవన్నారు. గర్భధారణకు ముందు, గర్భధారణ మొదటి త్రైమాసికంలో మహిళలు పూర్తి స్థాయి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమన్నారు.