రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం రెండు వారాల వ్యవధిలోనే 12 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని అమ్మేసిందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అంటే మన భారత కరెన్సీలో ఈ మెుత్తం బంగారం విలువ అక్షరాలా లక్షా 14వేల కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. మే 22 నాటికి విదేశీ మారక నిల్వల కోసం రూపాయి విలువను కాపాడటం కోసం భారత్ బంగారం అమ్మేసిందని బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ విడుదల చేసిన కథనం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బంగారానికి బదులుగా 7.5 బిలియన్ డాలర్లు విలువైన విదేశీ కరెన్సీ ఆస్తులను భారత్ కొనుగోలు చేసిందని బ్లూమ్ బర్గ్ నిపుణులు పేర్కొన్నారు.
బ్లూమ్ బర్గ్ ఎకనామిక్స్ లోని సీనియర్ ఆర్థిక వేత్త అభిషేక్ గుప్తా పంచుకున్న ఈ అంచనాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒకపక్క బంగారం దిగుమతులపై సుంకాలను పెంచిన వేళ బులియన్ రిజర్వ్స్ తగ్గుదల ఉండటంతో భారీగా వాటిని సెంట్రల్ బ్యాంక్ అమ్మిందనే అంచనాలను ఆయన పంచుకున్నారు. వాస్తవానికి దిగుమతి సుంకాలు పెంచితే గోల్డ్ రిజర్వ్స్ విలువ పెరగాలని.. దాని దానికి పూర్తి భిన్నంగా లెక్కలు ఉండటంతో రిజర్వు బ్యాంక్ గోల్డ్ అమ్మేసిందని గుప్తా వెల్లడించారు.
దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అమృత్ కాల్ అంటే ఇదేనా.. మోడీ ప్రభుత్వం దేశ బంగారు నిల్వలను అమ్ముకుందంటూ పార్టీ సోషల్ మీడియా ఎక్స్ పేజీలో చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే మరో పక్క ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇలాంటిదేమీ లేదంటూ బంగారం అమ్మకాల కథనాలను తిరస్కరించినట్లు CNBC-TV18 తమకు సమాచారం వచ్చిందంటూ పేర్కొంది. మెుత్తానికి గల్ఫ్ ప్రాంతంలో మెుదలైన యుద్ధపు సెగలు భారత్ బంగారం అమ్ముకునే దాకా వ్యాపించాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి పౌరుడిలోనూ వ్యక్తం అవుతోంది.
