న్యూఢిల్లీ: 2026, ఫిబ్రవరి 20వ ఉదయం 11.58 గంటల ప్రాంతంలో దేశవ్యాప్తంగా చాలా మంది మొబైల్ ఫోన్లలో అకస్మాత్తుగా పెద్ద బీప్ సౌండ్‌తో పాటు ఓ ఫ్లాష్ అలర్ట్ మేసేజ్ వచ్చింది. సడెన్‌గా భారీ శబ్ధంతో ఫోన్ మోగడంతో పాటు ఏదో మెసేజ్ రావడంతో చాలా మంది భయాందోళనకు గురయ్యారు. ఫోన్‌కు ఏమైంది..? ఒక్కసారిగా భారీ శబ్ధం ఎందుకు వచ్చింది..? అసలు ఆ అలర్ట్ మెసేజ్ ఏంటి..? అని జనం గందరగోళానికి గురయ్యారు.
అయితే ఇది భయపడాల్సిన విషయమేమి కాదు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమో ఇంకేమో కాదు.. ఇది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ పంపిన వార్నింగ్ మేసేజ్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ టెస్ట్ అలర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధాలు, ఆకస్మిక వరదలు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ శాఖ ఈ అలర్ట్ మేసేజ్‌లు పంపిస్తోంది. ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్ దశలో ఉంది. టెస్టింగ్‌లో భాగంగానే శుక్రవారం (ఫిబ్రవరి 20) పలువురికి ఈ హెచ్చరికలు పంపబడ్డాయి.
భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)తో సమన్వయంతో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఈ వార్నింగ్ మెసేజులు పంపింది. ‘‘ఇది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ పంపిన టెస్ట్ సెల్ ప్రసార సందేశం” అని ఫోన్లకు మెసేజ్ వచ్చింది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా అప్డేట్ అయినా తర్వాత భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలో వార్నింగ్ మెసేజ్‌లు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
