V6 News

ఎంపీ అయ్యింది టాయిలెట్లు క్లీన్ చేసేందుకు కాదు

ఎంపీ అయ్యింది టాయిలెట్లు క్లీన్ చేసేందుకు కాదు

మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోమారు కార్యకర్తలపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆమె భోపాల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అపరిశుభ్రతపై కొందరు కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తానేమీ మురుగు కాలువలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు ఎంపీని కాలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తనను టాయిలెట్స్ క్లీన్ చేసేందుకు ఎన్నుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’లో పాల్గొనాలని కోరగా, తానేమీ పారిశుద్ధ్య కార్మికురాలిని కాదని, స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, వారితో పని చేయిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో చర్చిస్తానని, స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానే తప్ప, ఇలా వీధులు ఊడ్చుతూ, దొడ్లు శుభ్రం చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఆమె పలుమార్లు తన వివాదాస్పద వైఖరితో విమర్శలు కొని తెచ్చుకున్నారు.