V6 News

బీఆర్ఎస్‎లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

బీఆర్ఎస్‎లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారన్న ఉత్కంఠకు తెరపడింది. 

కాంగ్రెస్‎కు జీవన్ రెడ్డి గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక బాధతోనే పార్టీ వీడుతున్నానని స్పష్టంచేశారు. తన అనుచరుల సమక్షంలో నిర్ణయం ప్రకటించిన ఆయన.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు.

 40 ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశానని, కానీ తనకు సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‏కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి చివరకు గులాబీ గూటికి  చేరారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‎లో చేరడంతో కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.