నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు..

నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు..

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఇంటిపోరుతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. నకిరేకల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. వేముల వీరేశం పేరు చెప్తేనే చిరుమర్తి ఒంటికాలుపై లేచే పరిస్థితి. అటు చిరుమర్తి లింగయ్య అంటేనే వీరేశం మండిపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఇద్దరి మధ్య వర్గపోరు మరోసా భగ్గుమంది. 

ఏమైందంటే..

ఏప్రిల్ 9వ తేదీన నకిరేకల్ సెంటర్ రోడ్డు లో ఓ భవనం దగ్గర చలివేంద్రంను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మండలి మాజీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ ప్రారంభించారు. అయితే  రోడ్డు వెడల్పులో భాగంగా ఈ  చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలగించారు. దీన్ని వేముల వీరేశం వర్గీయులు అడ్డుకున్నారు.  భవనాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు యత్నంచారు. దీన్ని కూడా  మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో  నకిరేకల్లో ఉద్రిక్తత నెలకొంది. 

కావాలనే తొలగించారు..

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించిన చలివేంద్రాన్ని కావాలనే తొలగించారని వేముల వీరేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాలతోనే నకిరేకల్ మున్సిపల్ అధికారులు, పోలీసులు చలివేంద్రాన్ని తొలగించారని మండిపడ్డారు. 

వర్గ పోరు ఎప్పటి నుంచి..

2018లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. వేముల వీరేశంపై గెలిచిన చిరుమర్తి..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ప్రత్యర్థులకు పొసగడం లేదు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ టికెట్ నాదే..కాదు నాదే అంటూ ఇద్దరు బహిరంగంగానే  ప్రకటించుకున్నారు.  వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై  ఆశలు పెట్టుకున్న వీరేశం...నకిరేకల్‌లో పట్టు కోల్పోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న సంఘటనలు చిరుమర్తి వర్సెస్‌ వేముల అన్నట్టుగా తయారైంది.