పొద్దుగాల ఎండ..  మాపటీలి వాన.. రాష్ట్రంలో భిన్నమైన  వాతావరణ పరిస్థితులు 

పొద్దుగాల ఎండ..  మాపటీలి వాన.. రాష్ట్రంలో భిన్నమైన  వాతావరణ పరిస్థితులు 
  • పొద్దుగాల ఎండ..  మాపటీలి వాన
  • రాష్ట్రంలో భిన్నమైన  వాతావరణ పరిస్థితులు 
  • పలు జిల్లాల్లో భారీ టెంపరేచర్లు 
  • మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దంతా ఎండకొట్టినా సాయంత్రం కాగానే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. బుధవారం పలు జిల్లాల్లో భారీ టెంపరేచర్లు నమోదు కాగా, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా గోదూరులో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా రాఘవపేటలో 44, మంచిర్యాల జిల్లా జన్నారంలో 43, ఆదిలాబాద్​జిల్లా అర్లి టీలో 42.9, కరీంనగర్​జిల్లా వీణవంకలో 42.8, నల్గొండ జిల్లా కట్టంగూర్​లో 42.7, జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​లో 42.5, నిర్మల్​జిల్లా నర్సాపూర్​లో 42.4, నిజామాబాద్​జిల్లా జక్రాన్​పల్లిలో 42.4, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగ్గా, దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రమే టెంపరేచర్లు ఎక్కువగా నమోదయ్యాయి. 

ఇక పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కుమ్రంభీమ్​ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం పడింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోనూ సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఘట్కేసర్​లో 3.9, ఉప్పల్​లో 2.2, సరూర్​నగర్​లో 2, అబ్దుల్లాపూర్​మెట్​లో 1.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు హైదరాబాద్​లోని తిరుమలగిరిలో 37.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 

బలపడుతున్న మోచా తుఫాన్ 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తెల్లవారుజామున మోచా తుఫానుగా బలపడుతుందని, 12న తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది. 14న బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్​తీరాల మధ్య గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల గాలులతో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు పెరుగుతాయని తెలిపింది. నాలుగు రోజుల పాటు సగటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.