తాగేందుకు మంచినీళ్లూ దొర్కట్లె.. చెన్నైలో వరద బాధితుల ఇబ్బందులు

తాగేందుకు మంచినీళ్లూ దొర్కట్లె.. చెన్నైలో వరద బాధితుల ఇబ్బందులు
  •     వర్షాలు తగ్గినా వరదలు తగ్గలె
  •     మూడ్రోజులుగా కరెంట్ కూడా లేదు

చెన్నై: మిగ్​జాం తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బుధవారం వర్షాలు తగ్గినప్పటికీ, చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో మూడ్రోజులుగా కరెంట్ లేక, జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాలు, నీళ్లు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై శివారులోని వెలచెరి, తంబరం ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ చిక్కుకున్న జనం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడి ప్రజల దుస్థితిని వివరిస్తూ నెటిజన్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ‘హాష్ ట్యాగ్ వెలచెరి’ ట్విట్టర్​లో ట్రెండ్ అవుతోంది.

ముంపు ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన..

వర్షాలు తగ్గడంతో సహాయక చర్యలు వేగవంతం చేశామని చీఫ్ సెక్రటరీ శివ్ దాస్ మీనా తెలిపారు. వరద తగ్గిన ఏరియాలకు కరెంట్, వాటర్ సప్లై చేస్తున్నామని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా ఫుడ్, బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన 372 రిలీఫ్ సెంటర్లలో 41,400 మంది వరద బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ బుధవారం పర్యటించారు. రిలీఫ్ సెంటర్లలోని బాధితులకు ఫుడ్ పంపిణీ చేశారు. కాగా, తుఫాన్ కారణంగా ఎన్నో ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయ్యాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయినోళ్ల కుటుంబాల గురించే నా ఆలోచనంతా. గాయపడినోళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు అలసట లేకుండా పని చేస్తున్నారు” అని మోదీ ట్వీట్ చేశారు.