- అటవీ నర్సరీల కోసం ‘హరిత్ సంకల్ప్’
- విత్తన సేకరణ నుంచి మొక్కల పంపిణీ వరకు పర్యవేక్షణ
- ప్రతి మొక్కకూ క్యూఆర్ కోడ్
- నర్సరీల్లో అక్రమాలకు చెక్
హైదరాబాద్, వెలుగు: అటవీ నర్సరీల్లో మొక్కల పెంపకం, పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు అటవీశాఖ సరికొత్త డిజిటల్ విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న కాగితపు లెక్కల స్థానంలో, సాంకేతికతను ఉపయోగించి ప్రతి మొక్కనూ పర్యవేక్షించేందుకు కసరత్తు చేస్తోంది. అటవీ నర్సరీల్లో ఎన్ని మొక్కలు పెంచారు..? ఎక్కడికి సరఫరా చేశారు..? అనే అయోమయానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.
మొక్కల పెంపకంలో జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ‘హరిత్ - సంకల్ప్’ అనే కేంద్రీకృత డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో ఈ వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా ప్రతి నర్సరీలోని మొక్కల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
ప్రతి మొక్కకూ క్యూఆర్ కోడ్..
నర్సరీలోని ప్రతి మొక్కకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే చాలు ఆ మొక్క ఏ జాతికి చెందింది.. ఎప్పుడు నాటారు.? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అటవీ నర్సరీలను జియో-ట్యాగింగ్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. దీని వల్ల ఏ ప్రాంతంలో ఏయే మొక్కలు సిద్ధంగా ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. గతంలో మొక్కల పంపిణీలో కాగితాలపై లెక్కలు చూపించి అక్రమాలకు పాల్పడేవారు. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీలు తప్పనిసరి చేయడం, స్టాక్ రిజిస్టర్లు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అవుతుండటంతో డేటా మొత్తం అందుబాటులో ఉంటుంది.
అక్రమాలకు చెక్..
గతంలో మొక్కల పంపిణీ లెక్కల్లో తేడాలు ఉండేవి. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో ప్రతి అంశం రికార్డ్ అవుతుంది. హరిత్ సంకల్ప్ ద్వారా రోల్-బేస్డ్ వర్క్‌ఫ్లో ఉండడంతో బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోపాటు 'ట్రేసిబిలిటీ' సాధ్యమవుతుంది. దీంతో ‘విత్తనం ఎక్కడ పుట్టింది.. ఎక్కడ నాటారు.. మొక్కలు ఎక్కడి పంపిణీ చేశారనే పూర్తి వివరాలు డిజిటల్ రూపంలో శాశ్వతంగా ఉంటాయి. ఇది పర్యావరణ పరిరక్షణలో గొప్ప విప్లవమని నిపుణులు పేర్కొంటున్నారు.

