- రాష్ట్రంలోని 3.38 కోట్ల ఓటర్లలో.. 2.56 కోట్ల మంది వివరాలే ఆన్‌లైన్
- అర్బన్‌లో వెనుకంజ.. జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డెడ్స్లో
- డాక్యుమెంట్లు లేకపోవడం, కిరాయికున్నోళ్లు అడ్రస్ మారడమే సమస్య
- డబుల్ ఓట్లు ఉన్నోళ్లు, ఫేక్ ఓటర్లు ఫారాలు వెనక్కి ఇవ్వకపోడమూ కారణమే!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ లక్ష్యసాధన పెద్ద సవాల్‌గా మారుతోంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి 100% ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ మాత్రం తేడా కొడుతోంది.
మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.56 కోట్ల ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటైజ్ చేశారు. అంటే 75.79 శాతం నమోదు మాత్రమే పూర్తయింది. ఈ లెక్కన మిగిలి ఉన్న సుమారు 82 లక్షల ఓటర్ల ఫారంల వివరాలను డిజిటైజ్ చేసేందుకు కేవలం ఆరు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది.
నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి కావాలంటే ప్రతిరోజూ సగటున దాదాపు 14 లక్షల ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే 25 లక్షల మేర ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్ కలెక్టబుల్ కింద నమోదు చేశారు. అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, ఫారెన్ (ఏఎస్‌డీఎఫ్) కింద వాటిని పేర్కొన్నారు. వీటిని కూడా మరోసారి పరిశీలించాలని ఎన్నికల అధికారులు ఆదేశించడం ఆసక్తిరేపుతోంది.
అర్బన్ జిల్లాల్లో డెడ్స్లోకు కారణాలెన్నో..
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌లో పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు అత్యంత వెనుకబడ్డాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలోని హైదరాబాద్ జిల్లా కేవలం 53.98% డిజిటైజేషన్‌తో పట్టికలో చివరి స్థానంలో నిలవగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి 58.66%, రంగారెడ్డి జిల్లా 61.77% తో అతి తక్కువ ఓటర్ల వివరాలను నమోదు చేశాయి.
సంగారెడ్డి 76.55%, వికారాబాద్ 77.68%, హనుమకొండ 78.37%, మంచిర్యాల 80.83%, కరీంనగర్ 80.87% జిల్లాల్లో కూడా నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ రకమైన వెనుకంజకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. బీఎల్వోలు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇంటి అడ్రస్‌ల ఆధారంగా ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అందులో అద్దెకు ఉన్న వారు ఇల్లు మారడం, కొత్త ఇంటి అడ్రస్ దొరక్కపోవడం, వారి వివరాలు కూడా తెలియకపోవడంతో ఫారాలను సేకరించడం సమస్యగా మారింది.
దీనికితోడు ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు పగటిపూట అందుబాటులో ఉండకపోవడం, గేటెడ్ కమ్యూనిటీలలోకి బీఎల్వోలకు ప్రవేశం సులభంగా లభించకపోవడం, చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు కనీసం డెత్అని చెప్పే ఆధారాలు కూడా లేకపోవడం డిజిటైజేషన్ తగ్గడానికి కారణాలుగా చెప్తున్నారు. ఇక ఇటు పట్టణాల్లో.. అటు గ్రామాల్లో రెండూ చోట్ల ఓట్లు ఉన్నోళ్లు గ్రామాల్లోనే ఓటు ఉంచుకునేందుకు ఆసక్తి చూపడంతో ఇక్కడ ఎన్యుమరేషన్ ఫారాలను పట్టించకోలేదని తెలుస్తోంది. ఇక సెటిలర్లు, ఇతర రాష్ట్రాల్లోని వాళ్లు, బతుకుదెరువుకోసం వచ్చినోళ్లకు ఎన్నికల నిబంధల ప్రకారం కొన్ని డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా మారింది.
అద్దె ఓటర్లే అసలు సమస్య..
ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రస్తుతం అధికారులను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘అద్దె ఓటర్ల’ ఫారాలే. సుదూర ప్రాంతాలు లేదా పట్టణాల్లో అద్దెకు ఉంటున్న కుటుంబాలకు సంబంధించి ఫారాలను బీఎల్వోలు యజమానుల వద్ద వదిలేసి వెళ్లారు. అద్దెకున్నవారు ఖాళీ చేసి వెళ్లడం లేదా వారు వివరాలు భర్తీ చేసి తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో ఆయా ఫారాలు తిరిగి బీఎల్వోలకు చేరడం లేదు.
ఫారాలు వెనక్కి రాకపోతే డిజిటైజ్ చేయడం సాధ్యపడదని, అందుకే ఆ ఫారాలను ఎలాగైనా తిరిగి వెనక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులు బీఎల్వోలు, సూపర్‌వైజర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బిఎల్వోలు స్వయంగా ఫోన్లు చేసి వివరాలు కోరుతున్నప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఓనర్ల వద్ద మిగిలిపోయిన ఫారాల లెక్కింపు తేలకపోవడం, ఇటు ఓటర్ల స్వస్థలాల్లో వారి వివరాలు సరిపోలకపోవడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.
గడువులోగా పూర్తి చేసేందుకు కసరత్తు
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన 82 లక్షల ఓటర్ల వివరాల నమోదును గడువులోగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, ఎన్నికల అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. తక్కువ నమోదైన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఖ్యను పెంచాలని, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలపై ప్రత్యేక దృష్టి సారించి సాయంత్రం వేళల్లో, శని, ఆదివారాల్లో ప్రత్యేక సర్వేలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను మళ్లీ సందర్శించి, పత్రాలు సమర్పించని ఓటర్లను నేరుగా సంప్రదించి సమాచారం సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు.
రూరల్ జిల్లాల్లో స్పీడ్.. ముందంజలో యాదాద్రి, జనగామ!
పట్టణ జిల్లాల తీరుకు భిన్నంగా గ్రామీణ ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఎన్యుమరేషన్ డిజిటైజేషన్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. 93.48% డిజిటైజేషన్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, జనగామ జిల్లా 90.92% తో రెండో స్థానంలో, మెదక్ జిల్లా 90.03%తో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ 89.19%, సూర్యాపేట 89.34%, మహబూబాబాద్ 89.43%, నల్గొండ 88.43%, జగిత్యాల 88.08%, ములుగు 88.12%, సిద్దిపేట 87.47%, కామారెడ్డి 87.08%, పెద్దపల్లి 86.59%, రాజన్న సిరిసిల్ల 86.74%, వరంగల్ 86.54% జిల్లాలు ఎక్కువ సంఖ్యలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తిచేశాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు దగ్గరగా ఉండటం, అద్దెదారుల సమస్య లేకపోవడం, బీఎల్వోలకు స్థానిక నివాసితులతో నేరుగా పరిచయాలు ఉండటంతో ఫారాల సేకరణ ఈజీ అయింది. ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, స్థానికులు అందుబాటులో ఉండటంతో పాటు డేటా ఎంట్రీ పనులు వేగంగా సాగడం ఇక్కడ సానుకూల అంశాలుగా మారాయి.
