
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ కొనసాగుతున్నది.ఇప్పటివరకు ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా ఎంప్లాయీస్ సర్వీసు రికార్డుల్ని ఇక నుంచి ఆన్లైన్లో ఉంచబోతున్నారు. నాలుగు నెలల కిందే ఇది ప్రారంభం కాగా, వచ్చే దసరా నాటికి పూర్తవుతుంది. దసరా నుంచి డిజిటలైజేషన్ అధికారికంగా అందరికీ అందుబాటులో ఉంచుతారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏండ్ల పాటు ఆఫీసు చుట్టు తిరిగి ఎంతో మంది విసుగు చెందారు. రానున్న రోజుల్లో ఉద్యోగులకు అలాంటి కష్టాలు రాకుండా ఇరిగేషన్ శాఖ సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్చేపడుతున్నది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఇక సర్వీసు బుక్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇక అంతా ఆన్ లైన్లోనే...
ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా సర్వీస్ బుక్స్ చాలా ముఖ్యమైంది. ప్రతీ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బుక్ లో ఎంట్రీస్ ఇవ్వాలి. కానీ ఏ శాఖలోనూ ఇది జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ, తమ ఉద్యోగులందరి సర్వీసు బుక్స్ ను ఆన్ లైన్లో ఉంచబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి శాఖ పరిధిలో 8,365 మంది ఉద్యోగులుండగా, అందులో రెగ్యులర్ 7,037 మంది, వర్క్ ఛార్జెస్ 1245 మంది, డిప్యుటేషన్ లో 83 మంది ఉన్నారు. వీరందరి రికార్డులు ఇక నుంచి ఆన్ లైన్లోనే చూసుకునేలా డేటా అందుబాటులో ఉంచారు. ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంప్లాయీస్ డేటా స్కానింగ్ పూర్తయింది. ఇక నుంచి సర్వీస్ ఛార్జెస్, డిప్యుటేషన్ ఉద్యోగుల స్కానింగ్ జరగనుంది.
సీఈలు, ఎస్ఈలదే మానిటరింగ్...
సర్వీసు రికార్డుల డిజిటలైజేషన్ కోసం ఆరుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగుల బుక్స్ ను సేకరించి ప్రతి పేజీని స్కానింగ్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత ప్రతీ సంవత్సరం రికార్డులను అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ బాధ్యతల్ని డిస్పర్సింగ్ డ్రాయింగ్ ఆఫీసర్స్(డీడీవో) చూస్తారు. వారిపైన మానిటరింగ్ ను సీఈలు, ఎస్ఈలకు కట్టబెడుతున్నారు. ట్యాంపరింగ్ జరగకుండా డీడీవోల వైజ్ గా షెడ్యూల్ ఇస్తున్నారు. ప్రతీ రికార్డును పర్యవేక్షించేందుకు గాను సీఈలు, ఎస్ఈలకు పోర్టల్ కనపడేలా నిబంధనలు తయారవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది సీఈలు ఉండగా వారి పరిధిలోని మొత్తం ఉద్యోగుల అప్డేషన్ జరగనుంది. స్పెషల గ్రేడ్ ప్రమోషన్ (ఎస్జీపీ–2), యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఎంట్రీస్(జీఐఎస్) వంటివన్నీ ఇక నుంచి రెగ్యులర్ గా అప్డేట్ అవుతాయి. డీడీవో పరిధిలో ఏదైనా అప్డేట్ జరగకపోతే వెంటనే ఎస్ఈ లేదా సీఈ అలర్ట్ చేస్తారు. దీనికి ఓవరాల్ అడ్మిన్ గా ఈఎన్సీ ఉంటారు.
ఉద్యోగులను గౌరవించేందుకే...
జీవితాన్ని ఉద్యోగానికే అంకితం చేసిన సిబ్బందికి రిటైర్మెంట్ సమయంలో గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే డిజిటలైజేషన్ ప్రారంభిస్తున్నాం. ఉద్యోగులను గౌరవించాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని ఆచరణలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది పూర్తయితే మా శాఖలోని అందరికీ రిటైర్మెంటప్పుడే బెనిఫిట్స్ అందుతాయి. ఏండ్లకేండ్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
- జి.అనిల్ కుమార్, ఈఎన్సీ (అడ్మిన్), ఇరిగేషన్ శాఖ