కాంగ్రెస్​తో పొత్తులపై సీపీఎంలో డైలమా!

కాంగ్రెస్​తో  పొత్తులపై సీపీఎంలో డైలమా!
  • మిర్యాలగూడతో పాటు పాలేరు సీటు ఇవ్వాలంటున్న నేతలు 
  • నాన్చుతున్న కాంగ్రెస్.. ఖమ్మంలో మరో సీటు ఇచ్చేందుకు మొగ్గు  
  • సీపీఐ రెండు సీట్లకు సూత్రప్రాయ అంగీకారం  

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో పొత్తుపై సీపీఎంలో సందిగ్ధం నెలకొన్నది. తాము కోరిన సీట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ నాన్చుతుండటంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొన్నది. ప్రస్తుతానికి మిర్యాలగూడ సీటును ఓకే చేసిన కాంగ్రెస్, మరో సీటుపై మాత్రం తేల్చడం లేదు. మరోపక్క సీపీఐకి కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లకు ఆ పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. దీంతో పొత్తు విషయంలో సీపీఎంలోనే సందిగ్ధం నెలకొన్నది. 

రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ ఈసారి కలిసే పోటీ చేయాలని ఏడాది నుంచి చెప్తూ వచ్చినా.. ఎన్నికలు దగ్గరపడటంతో బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమయ్యాయి. అయితే లెఫ్ట్ పార్టీలు అడిగిన సీట్లు ఇచ్చేందుకు ఇష్టంలేని బీఆర్ఎస్ సొంతంగా అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు బెడిసికొట్టింది. దీంతో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నందున కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. 

సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ సీట్లలో పోటీ పార్టీ రాష్ట్ర నేతలకు ఇష్టం లేకపోయినా పార్టీ జాతీయ కమిటీ ఆదేశాలతో అంగీకరించినట్లు చెప్తున్నారు.

 సీపీఎం దారెటు? 

పొత్తుల్లో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ సీటును కాంగ్రెస్ కన్ఫామ్ చేసింది. రెండో సీటును పాలేరులో ఇవ్వాలని సీపీఎం పట్టుపడుతోంది. కానీ, ఖమ్మం జిల్లాలో హాట్ కేక్​గా ఉన్న ఆ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. ఖమ్మంలోనే వైరా సీటు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. దీనిపై సీపీఎం రాష్ట్ర నేతలు అసంతృప్తితో ఉన్నారు. మిర్యాలగూడతోపాటు అడిగింది కాకుండా వేరే సీటు ఇస్తామంటుండటంతో సీపీఎంలో అంతర్మథనం మొదలైంది. 

పొత్తు కుదరకపోతే లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీచేయాలని ముందే నిర్ణయించుకున్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదనలకు సీపీఐ ఓకే చెప్పింది. దీంతో తాము ఒంటరిగా పోటీ చేయాలా? ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకుని కాంగ్రెస్ తో కలిసి నడవాల్నా? అనే విషయంలో సీపీఎంలో తర్జనభర్జన షురువైంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.