కాసేపట్లో పెళ్లి పూర్తి అవుతుంది. అందరు పెళ్లి హడావుడిలో ఉండగా ఒక్కసారిగా పెళ్లి కూతురు స్టేజ్ మీదనే కుప్పకూలిపోయింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో పెళ్లి వేడుకల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటల మీద వధువుకి వరుడు తాళి కడుతున్న సమయంలోనే ఓ యువకుడు వధువుపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల మధ్య పోరాడుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం... చౌసా నగర్ పంచాయతీలోని మల్లా టోలా ప్రాంతంలో ఆరతి కుమారి (18) అనే యువతికి వివాహం జరుగుతోంది. వరుడితో కలిసి దండలు మార్చుకుంటుండగా.. ముసుగు ధరించిన ఓ వ్యక్తి హఠాత్తుగా వేదికపైకి వచ్చి ఆమె కడుపులో కాల్చాడు.
అదే సమయంలో పెద్దగా మ్యూజిక్ వస్తుండటంతో కాల్పుల శబ్దం ఎవరికీ వినబడలేదు. కానీ ఆరతి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, రక్తం రావడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.
అయితే ఆసుపత్రికి తరలించే ముందు ఆరతి స్పృహలో ఉండగా దినబంధు నన్ను కాల్చాడు అని ఆమె కుటుంబిలకు చెప్పింది. నిందితుడు దినబంధు అదే గ్రామానికి చెందిన వ్యక్తి. గత రెండేళ్లుగా ఆరతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.
ఆరతికి గతంలో కుదిరిన ఓ పెళ్లి సంబంధాన్ని కూడా అతను వరుడి ఇంటి వాళ్ళని బెదిరించి చెడగొట్టాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిని కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ప్రస్తుతం ఆరతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను వారణాసిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతోంది. నిందితుడు దినబంధు ప్రస్తుతం పరారీలో ఉండగా... పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
