తన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సూపర్ సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు ఆర్ఎస్జె స్వరూప్.. ఈసారి ముగ్గురు చిన్నపిల్లలతో ఓ క్రైమ్ కామెడీ మూవీ తీశాడు. తాప్సీ కీలక పాత్ర పోషించింది. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా స్వరూప్ ఇలా ముచ్చటించాడు.
‘‘ఏడెనిమిదేళ్ల క్రితం పేపర్లో వచ్చిన ఓ వార్త నన్ను ఆకర్షించింది. అందులో ముగ్గురు పిల్లలు దావూద్ ఇబ్రహీమ్ని పట్టుకోవాలనుకున్నారనే లైన్ కామెడీగా అనిపించింది. బీహార్‌లో జరిగిన ఆ రియల్ ఇన్సిడెంట్‌కి ఫిక్షన్ని జోడించి ఈ కథ రాశాను. ‘ఏజెంట్ ఆత్రేయ’ కంటే ముందే ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. ఇందులో అరవై శాతం కామెడీనే ఉంటుంది. ముగ్గురు పిల్లల పాత్రలే మెయిన్. తాప్సీ గారిది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. మొదట మేల్ ఆర్టిస్ట్‌ను అనుకున్నా. కానీ నా గత చిత్రానికి దగ్గరగా అనిపిస్తుందేమోనని ఫిమేల్గా మార్చేశా. తాప్సీ అయితే కరెక్ట్ అని అప్రోచ్ అయ్యాం. తన పాత్ర నలభై నిముషాలే ఉంటుంది. పైగా లీడ్ రోల్ కాదు కనుక ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాం. స్టోరీ నచ్చడంతో ఆమె ఓకే చెప్పారు. ‘క్యారెక్టర్ చిన్నదా, పెద్దదా అని కాదు.. మంచి సినిమాలో పార్ట్ అవ్వాలని నటిస్తున్నాను’ అని చెప్పారామె. ఆవిడ చాలా ప్రొఫెషనల్. తన కోసం సినిమాకి వస్తే డిజప్పాయింట్ అవుతారేమోనని తాప్సీ యాంగిల్లో ప్రమోట్ చేయడం లేదు. నెల రోజుల పాటు ఆడిషన్ చేసి రోషన్, భాను ప్రకాష్, జై తీర్థ అనే ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేశాం. అరవై రోజులు వర్క్ షాప్ చేశాం. పేపర్లో నేను చూసిన ఆర్టికల్ పేరే సినిమాకి టైటిల్‌గా పెట్టా. ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ చిత్రాల మధ్య మా సినిమాని విడుదల చేస్తున్నాం. ఆ రెండు సినిమాల గురించి ట్రైలర్లో చూపించిన డైలాగ్ క్యాజువల్‌గా రాసుకున్నదే. ఇప్పుడది కలిసొచ్చింది. సమ్మర్ సీజన్, ఉగాదితో పాటు సోలో రిలీజ్ కూడా కలిసొస్తుందని ఏప్రిల్ 1న వస్తున్నాం. పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా రిలీజ్ అనేది ఎప్పటినుంచో వర్కవుటవుతోంది కూడా. నా చిన్నప్పుడు వర్మ గారిని దావుద్ ఇబ్రహీమ్ అనుకునేవాణ్ణి. ఆ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది (నవ్వుతూ). ఆయన ఎక్కువ అలాంటి సినిమాలు తీయడంతో అలా రిలేట్ చేసుకుంటారు. అదే ఈ సినిమాలో పెట్టాను. ఇతర భాషల్లో రీమేక్ తప్ప డబ్ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాసిన స్క్రిప్ట్ ఇది. బేసిగ్గా నాకు కామెడీ, థ్రిల్లర్, డ్రామా జానర్స్ ఇష్టం. అందుకే నేను ఏ స్టోరీ రాసినా అందులో ఈ మూడూ ఉంటాయి.’’