జర్నలిస్ట్ మూర్తి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే.. దర్శకుల సంఘం సంచలన లేఖ!

 జర్నలిస్ట్ మూర్తి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే.. దర్శకుల సంఘం సంచలన లేఖ!

టాలీవుడ్‌లో జర్నలిస్టులు, దర్శకుల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. జర్నలిజం ముసుగులో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనే ఆరోపణలతో ఆయనపై చర్యలు తీసుకోవాలని దర్శకుల సంఘం డిమాండ్ చేసింది.

దర్శకుల అసహనం

జర్నలిస్ట్ మూర్తి ప్రవర్తనపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఇప్పటికే కఠిన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఆయనను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై తెలుగు సినీ దర్శకుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం మూడు నెలల సస్పెన్షన్ సరిపోదని, ఆయనను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేఖను విడుదల చేసింది.

లేఖలో ఏముందంటే?

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి ఎన్. సాయి రాజేష్ సంతకాలతో కూడిన ఈ లేఖలో సంచలన అంశాలను ప్రస్తావించారు.  జర్నలిజం పేరుతో మూర్తి దర్శకులపై వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని, ఇది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయనపై ఆరు నెలల సస్పెన్షన్ విధించినా, తిరిగి సభ్యత్వం ఇవ్వడం వల్ల ఆయనలో మార్పు రాలేదని, అది పరిస్థితిని మరింత దిగజార్చిందని పేర్కొన్నారు.  సినిమా ప్రచారంలో కీలక పాత్ర పోషించే జర్నలిస్టులు ఇలాంటి వివాదాల్లో ఉండటం ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగకరమని, అందుకే ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ : తమిళ సమరం : నామినేషన్లు వేసిన సీఎం స్టాలిన్, హీరో విజయ్

పరిశ్రమలో చర్చనీయాంశం

సాధారణంగా దర్శకులు, జర్నలిస్టులు ఇండస్ట్రీకి రెండు కళ్లలా పనిచేస్తుంటారు. కానీ, కొందరి తీరు వల్ల ఈ రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతుండటం విచారమని పలువురు జర్నలిస్టులు పేర్కొంటున్నారు.. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత విద్వేషాలకు వేదిక కాకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుల సంఘం ఇంత తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, TFJA తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం చివరకు రాజీతో ముగుస్తుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి.