మంచిర్యాల, వెలుగు: స్టేట్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మంచిర్యాల సభలో మరోసారి బయటపడ్డాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి నస్పూర్‌లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్‌గా హాజరుకాగా, జాతీయ స్థాయిలో కీలక నేత కొప్పుల రాజు, స్టేట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ మధుయాష్కీ, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గేతో కలిసి వేదిక మీదికి వచ్చిన రేవంత్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు భట్టి విక్రమార్క చేతులు పట్టుకొని వేదికపై నుంచి సభికులకు అభివాదం చేశారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. విక్రమార్కను పొగడ్తల్లో ముంచెత్తారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా ఆయనను దివంగత వైఎస్ఆర్తో పోల్చారు. భట్టి పంచెకట్టుతో పాదయాత్ర చేస్తుంటే తనకు వైఎస్ఆర్ను చూసినట్టు ఉందని ఆకాశానికి ఎత్తారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క, ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు ‘‘సీఎం భట్టి... సీఎం భట్టి’’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు సైతం విక్రమార్కను పొగుడుతూ మాట్లాడారు. ప్రేమ్‌సాగర్‌రావు తన స్పీచ్‌లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వేదికపై ఉన్న లీడర్లలో ఎవరో ఒకరు సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అప్పుడు కూడా లీడర్లందరూ భట్టి వైపు చూడడంతో రేవంత్ అసహనంగా కనిపించారు. వేదికపై మల్లికార్జున ఖర్గే పక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూర్చోగా ఆయన పక్కన రేవంత్‌రెడ్డి, ఆ పక్కన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూర్చున్నారు. చాలాసేపటి వరకు రేవంత్‌ను ఎవరూ పలకరించలేదు. ఈ సభకు అన్నీ తానై వ్యవహరించిన ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఆయనను రిసీవ్ చేసుకోలేదు.
ఇది గమనించిన ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్‌గౌడ్ రేవంత్ దగ్గరకు వచ్చి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ ముగ్గురు మాటలు కలిపి నవ్వుకున్నారు. ఈ పరిణామాలతో కంగుతిన్న రేవంత్‌రెడ్డి సభా వేదికపై చాలా అసహనంగా కనిపించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ‘‘జై రేవంత్, జై జై రేవంత్”అంటూ నినాదాలు చేసినప్పటికీ ఆయనలో అంత ఉత్సాహం కనిపించలేదు. చివరగా మాట్లాడిన కొప్పుల రాజు, మల్లికార్జున ఖర్గే సైతం తమ స్పీచ్‌లో ‘‘సీఎం భట్టి’’ అన్న కామెంట్లను ఖండిస్తారని అనుకున్నప్పటికీ వారు సైతం వినీ విననట్టు వదిలేశారు. రేవంత్ వ్యతిరేక వర్గం లీడర్లు ఆయనను ఒంటరి చేసి మాట్లాడడాన్ని రేవంత్ ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంటూనే తామంతా ‘బలగం’ సినిమాలో వలె కలిసిపోతామంటూనే ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేదాలు సమసిపోయే స్థాయిలో లేవన్న సంకేతాలు కనిపించాయి. ఈ పరిణామాలపై అటు రేవంత్ వర్గంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ అనుచరులు దూరం..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వన్ మ్యాన్ షో చేశారు. మొదటి నుంచి రేవంత్‌రెడ్డితో విభేదిస్తూ భట్టి విక్రమార్క గ్రూపులో కొనసాగుతున్న ఆయన ఈ సభకు సైతం రేవంత్ అనుచరులను దూరం పెట్టి తన పంతం నెగ్గించుకున్నారు. మాజీ మంత్రి గడ్డం వినోద్, టీపీసీసీ సెక్రెటరీ గోమాస శ్రీనివాస్, సీనియర్ లీడర్ కేవీ ప్రతాప్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్‌ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, బోడ జనార్దన్, నాయకుల కారుకూరి రామచందర్, ముత్తె సత్తయ్య, మత్తమారి సూరిబాబు తదితరులు ప్రేమ్‌సాగర్‌రావును వ్యతిరేకిస్తూ రేవంత్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఈ కారణంగా వీరిని ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రకు దూరం పెట్టారు. అదేవిధంగా బహిరంగ సభకు వారు హాజరుకావద్దని ప్రేమ్‌సాగర్‌రావు షరతు పెట్టారు. చివరి నిమిషంలో అయినా తమకు ఆహ్వానం అందుతుందని వీరంతా ఎదురుచూసినప్పటికీ వేదిక పైకి రావడానికి పాస్‌లు కూడా ఇవ్వకపోవడంతో కంగుతిన్నారు.
వీరంతా మంచిర్యాలలోని గోమాస శ్రీనివాస్ నివాసంలో సమావేశమై భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలువురు లీడర్లకు సైతం ఆహ్వానం అందలేదు. అంతేకాకుండా మొన్నటివరకు ఏఐసీసీ నిర్ణయాల అమలు కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో ప్రేమ్‌సాగర్‌రావుకు విభేదాలు ఉండేవి. సరిగ్గా బహిరంగ సభకు ఒక్కరోజు ముందు మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. ఉమ్మడి జిల్లాపై ఆధిపత్యం సాధించడం కోసం ప్రయత్నిస్తున్న ప్రేమ్‌సాగర్‌రావుకు మహేశ్వర్‌రెడ్డి అడ్డుగా నిలిచారు. ఆయన బీజేపీలో చేరడంతో ప్రేమ్‌సాగర్‌రావు కల నెరవేరినట్లు అయింది. బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లకు 8 సీట్లు సాధిస్తామని ఆయన చెప్పడం దీనికి నిదర్శనం. నిర్మల్‌కు చెందిన బీఆర్ఎస్ లీడర్ శ్రీహరిరావు త్వరలోనే రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన చేరితే ఉమ్మడి జిల్లాలో మళ్లీ రేవంత్, భట్టి గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

