రాజగోపాల్​రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!

రాజగోపాల్​రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు పీసీసీ సిద్ధమవుతోంది. సోమవారం గాంధీభవన్​లో పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశం కానుంది. రెండు రోజుల క్రితం బీజేపీని ప్రశంసిస్తూ రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్​కు భవిష్యత్​ లేదని, బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. హైకమాండ్​ నిర్ణయం మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తన వ్యాఖ్యలపై రాజగోపాల్​రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని పీసీసీ ఎన్నికల కమిషన్​ కో–ఆర్డినేటర్​జీ నిరంజన్​ మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి అడ్డుపడుతూ కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించుకుంటూ స్వార్థం చూపిస్తున్నారని, వారి వైఖరితో విసిగి వేసారినందువల్లే రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ చీఫ్​ పదవి వద్దంటున్నారని అన్నారు. రాజగోపాల్​రెడ్డి లాంటి స్వార్థ నాయకులు పార్టీ వీడితేనే శని విరగడవుతుందంటూ కార్యకర్తలు భావిస్తున్నారన్నారు. అలాంటి నేతలు వేరే పార్టీలోకి వెళితే వాళ్ల నోటి దూల తీరుతుందని మండిపడ్డారు.