హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మూడు రోజుల కిందట పార్టీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారని.. అయితే, చిన్నారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ అని, ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇచ్చామని, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచనతోనే పార్టీ ఉందన్నారు.
కానీ, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు ఉన్నాయని అక్కడి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదును, ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ను పరిశీలించి నివేదికను ఏఐసీసీకి పంపిస్తామన్నారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవన్నారు. చిన్నారెడ్డి విషయంలో వనపర్తి కాంగ్రెస్ కేడర్ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
‘సర్’ గడువు పెంచాలి..
తెలంగాణలో ‘సర్’ గడువును పొడిగించాలని ఎన్నికల సంఘానికి మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 3 కోట్ల 38 లక్షల ఓట్లు ఉంటే అందులో 20 శాతానికి పైగా అంటే 73 లక్షల ఓట్ల వరకు తొలగించారని ఆరోపించారు. ఇందులో ఎక్కువగా పేదల ఓట్లే ఉన్నాయన్నారు. మరోవైపు, బీజేపీ అనుబంధ సంఘంగా ఎన్నికల సంఘం మారిందని ధ్వజమెత్తారు.
ఈసీ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే తెలంగాణలో ఇంత భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నదని విమర్శించారు. ఓట్ల తొలగింపునకు మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
