టూరిజం శాఖలో డిస్కౌంట్ దందా..టూరిస్టులకు రాయితీల పేరిట ఉద్యోగుల చేతివాటం

టూరిజం శాఖలో డిస్కౌంట్ దందా..టూరిస్టులకు రాయితీల పేరిట ఉద్యోగుల చేతివాటం
  •     కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
  •     గతంలోనూ కోటి రూపాయలకుపైగా పక్కదారి

హైదరాబాద్, వెలుగు: పర్యాటక శాఖలో ‘డిస్కౌంట్’ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీంతో శాఖ ఆదాయాని గండిపడుతుండగా.. ఉద్యోగుల జేబులు మాత్రం నిండుతున్నాయి. పర్యాటకులకు ఇచ్చే రాయితీ సౌకర్యాన్ని ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుని అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటకుల నుంచి టికెట్లకు పూర్తి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది.. రికార్డుల్లో మాత్రం వారికి రాయితీ ఇచ్చినట్లు చూపిస్తూ ఆ డబ్బును జేబులో వేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం, ఆడిటింగ్ లోపాలతో ఈ దందా నిరాటంకంగా సాగుతున్నది.

డిస్కౌంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు నమోదు

సాధారణంగా బస్సుల్లో బుకింగ్స్, పర్యాటక ప్రదేశాలు, బోటింగ్ పాయింట్లు, హరిత హోటళ్లలో పిల్లలకు, వృద్ధులకు లేదా గ్రూప్ బుకింగ్‌‌‌‌‌‌‌‌లకు ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పిస్తుంది. ఇక్కడే సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్​ నుంచి అరుణాచలం బస్సులో వెళ్లాలనుకుంటే ఒక ఎంట్రీ టికెట్ లేదా బస్సు ధర రూ.8 వేలు అనుకుంటే.. ఉద్యోగి పర్యాటకుడి దగ్గర రూ.8 వేలు  తీసుకుంటాడు. 

కానీ, సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో లేదా రికార్డు పుస్తకంలో మాత్రం సదరు పర్యాటకుడిని ‘స్పెషల్ కేటగిరీ’ కింద చూపిస్తూ 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇచ్చినట్లు ఎంట్రీ చేస్తారు. దీంతో ప్రభుత్వ ఖాతాకు రూ.5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే వెళ్తుంది. మిగిలిన అమౌంట్ ఉద్యోగి జేబులోకి వెళ్తున్నది. బోటింగ్, హరిత హోటల్స్, పర్యాటక ప్రాంతాల వద్ద టికెట్ల విషయంలోనూ ఈ వ్యవహారం నడుస్తున్నదనే ఆరోపణలున్నాయి. 

ఇలా నెలకు రూ.లక్షల్లోనే ఆదాయానికి గండి పడుతున్నదని ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన మేనేజర్లు, ఈడీ అంతా దీన్ని ‘మాములు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మాన్యువల్ ఎంట్రీలు, మరికొన్ని చోట్ల సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ లొసుగులను అడ్డుపెట్టుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. ఆకస్మిక తనిఖీలు లేకపోవడం కూడా ఈ దందాకు ప్రధాణ కారణంగా ఉంది.

సమగ్ర విచారణ చేయాలి

పర్యాటక శాఖ ఆదాయానికి గండి కొడుతున్న ఇలాంటి దందాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులను సస్పెండ్ చేసి సరిపెట్టకుండా, సిస్టమ్‌‌‌‌‌‌‌‌లోని లోపాలను సరిదిద్దాల్సి ఉంది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ టికెటింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడం, తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారానే ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చు.

ప్రియుడి కోసం రూ. కోటి పక్కదారి

గతంలో ఓ మహిళా ఉద్యోగి ఏకంగా కోటి రూపాయలకుపైగా నిధులను పక్కదారి పట్టించిన ఘటన సంచలనం సృష్టించింది. రూ.1.05 కోట్లను తన ప్రియుడి బ్యాంకు అకౌంట్​కు మళ్లించినట్లు ఎంక్వైరీలో తేలింది. సదరు ఉద్యోగినిపై కేసు నమోదు చేయడంతో పాటు డబ్బుల రికవరీకి ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలిచ్చారు. 

ఆ తర్వాత విచారణ ఎంతవరకు వచ్చింది.. ఎన్ని నిధులు రికవరీ చేశారనేదానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా, టూరిజం హోటల్స్​లో స్వైపింగ్ మిషన్ల ద్వారా రూ.80 లక్షలు కాజేసినా.. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నది తెలియజేయడం లేదు. ఇలాంటి ఎన్నో అక్రమాలు జరుగుతున్నా..అధికారులు దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి.