
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏండ్లకు పెంచాలి
43 శాతం ఐఆర్ ఇవ్వాలి
16 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత
హైదరాబాద్, వెలుగు: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీఎస్ ఎస్‌కే జోషిని ఉద్యోగుల జేఏసీ కోరింది. వారి సమస్యలను పరిష్కరించాలని విన్నవించింది. జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత నేతృత్వంలో నాయకులు గురువారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ను కలిసి 16 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. అందులో ఐదో డిమాండ్‌గా ఆర్టీసీ కార్మికుల అంశాన్ని ప్రస్తావించింది. మిగతా డిమాండ్లలో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్లు, వర్కర్లు, పెన్షనర్ల అంశాలు ఉన్నాయి. గతేడాది జులై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని, ఆ రోజు నుంచి 43 శాతం ఐఆర్ ఇవ్వాలని సీఎస్‌ను జేఏసీ నేతలు కోరారు. ఈ ఏడాది జులై ఒకటి నాటికి ఒక డీఏ ఇవ్వాల్సి ఉందని, దానిని వెంటనే అమలు చేయాలన్నారు.
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణకు రప్పించాలన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కల్పించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయ సంస్థ, వ్యవసాయ మార్కెట్లు, యూనివర్సిటీలు, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి సెలవులతో కూడిన ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
టీచర్లకు కామన్ రూల్స్ అమలు చేయాలి
టీచర్లకు కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పండింట్లు, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సీఎస్‌కు ఉద్యోగుల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, గోపన్‌పల్లిలో ఏపీఎన్జీవోల పేరుతో ఇచ్చిన ఇంటి స్థలాలను భాగ్యనగర్ తెలంగాణ ఎన్‌జీవోస్ యూనియన్ పేరుతో బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. హైక్యాడర్ ఉద్యోగాల్లో ప్రమోషన్ పరిమితిని మూడేండ్ల నుంచి రెండేండ్లకు తగ్గించాలని, అన్ని శాఖల్లో డీపీసీ ద్వారా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. 70 ఏండ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15 శాతం పెన్షన్ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులకూ తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలన్నారు. అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ప్రభుత్వమే వారికి నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసినవారిలో ఉద్యోగ సంఘాల నేతలు సత్యనారాయణ, రాజేందర్, జ్ఞానేశ్వర్, మనిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.
19న ఆర్టీసీ బంద్కు మద్దతు
శనివారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్ర బంద్కు ఉద్యోగుల మద్దతు ఉంటుందని జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి ప్రకటించారు. బంద్ రోజు ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ నెలాఖరులోపు తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకైనా వెనుకాడబోమని రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ నేతలందరం కూర్చొని భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. సీఎస్ జోషిని కలిసిన తర్వాత ఉద్యోగుల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని సీఎస్‌ను కోరినట్టు రవీందర్‌రెడ్డి చెప్పారు. సీఎస్‌ను కలిసిన తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం కలిగిందని రవీందర్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితిపై సీఎస్‌కు వివరించామని, సాధ్యమైనంత త్వరగా సమ్మె విరమణకు చొరవ చూపాలని కోరామని అన్నారు. ఉద్యోగుల సర్వీసులో సెల్ఫ్ డిస్మిస్ అనే పదమే ఉండదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజీవో అధ్యక్షురాలు మమత డిమాండ్ చేశారు.