వియన్నా: ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రియాలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఇంటిని పోలీస్ స్టేషన్‌గా మార్చాలని నిర్ణయించింది. దాదాపు రూ.247 కోట్లతో ఈ ఇంటిని పోలీస్ స్టేషన్‌గా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2026 ఆగస్ట్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలు అవుతాయని ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 1889, ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌనౌ యామ్ ఇన్ అనే పట్టణంలో అడాల్ఫ్ హిట్లర్ జన్మించాడు.
ఆస్ట్రియా-జర్మనీ సరిహద్దుకు సమీపంలో ఉన్న సాల్జ్‌బర్గర్ వోర్‌స్టాడ్ 15 అనే చిరునామాలో ఉన్న ఇంట్లో కొన్నాళ్లు నివసించాడు. హిట్లర్ ఈ ఇంట్లో కొన్ని రోజుల పాటే నివసించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాజీ సానుభూతిపరులు ఈ ఇంటిని ప్రార్థనా స్థలంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం హిట్లర్ పుట్టినరోజున నాజీ సానుభూతిపరులు ఈ ఇంటి దగ్గర ర్యాలీ నిర్వహిస్తారు.
ఈ క్రమంలో ఆస్ట్రియా ప్రభుత్వం 2016లో ఒక ప్రత్యేక చట్టం రూపొందించి హిట్లర్ జన్మించిన ఇంటిని ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆ ఇంటిని పోలీస్ స్టేషన్‌గా మార్చాలని నిర్ణయించింది. హిట్లర్ జన్మస్థలాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చాలన్న ఆస్ట్రియా ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆ భవనాన్ని 240 కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ స్టేషన్‌గా మార్చే బదులు విద్యా సంస్థ లేదా ఆసుపత్రిగా మారిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి యేటా నాజీ తీవ్రవాదులు ఈ ఇంటి దగ్గర ర్యాలీ నిర్వహించడం, సమావేశం కాకుండా నిరోధించవచ్చని యూదు సానుభూతిపరులు అంటున్నారు.
