Asia Cup 2023: ఆసియా క‌ప్ మ్యాచ్‌ల‌ను ఇలా ఫ్రీగా చూసేయండి

Asia Cup 2023: ఆసియా క‌ప్ మ్యాచ్‌ల‌ను ఇలా ఫ్రీగా చూసేయండి

క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్‌స్టార్ శుభ‌వార్త చెప్పింది. ఆసియా కప్ 2023 ప్రత్యక్ష ప్రసారాలు త‌మ యాప్‌లో ఉచితంగా చూడవచ్చని తెలిపింది. అయితే.. ఇది కేవ‌లం మొబైల్‌కు మాత్ర‌మేన‌ని వెల్లడించింది. ఈ మేర‌కు ఓ వీడియో విడుద‌ల చేసింది. 

ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లను జియో సినిమా యాప్ ఉచితంగా ప్రసారం చేసి.. కోట్ల మందికి చేరువైన విషయం తెలిసిందే. ఇప్పుడు హాట్‌స్టార్ అదే ప్లాన్ అనుసరిస్తోంది. ఎక్కువ మంది త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను చేరువకావడ‌మే ల‌క్ష్యంగా.. ఆసియా క‌ప్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనుంది. ఎక్క‌డికి వెళ్లినా.. ఎలాంటి అవాంత‌రాలు లేకుండా మ్యాచ్‌ల‌ను చూడవ‌చ్చు అనే అర్థం వ‌చ్చేలా వీడియో  విడుద‌ల చేసింది.

"భారతీయుల హృదయాల్లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. మా వినియోగదారులకు ఈ క్రీడను మరింత చేరువ చేయాలనుకుంటున్నాం. ఆసియా కప్‌తో పాటు రాబోయే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ని సైతం మొబైల్‌లో ఉచితంగా వీక్షించే అవకాశాన్ని అందించడం ద్వారా, క్రికెట్‌ను దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరువ చేసేందుకు మేము సన్నద్ధమయ్యాం.." అని డిస్నీ+హాట్‌స్టార్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, ఆరు దేశాల మధ్య జరగనున్న ఆసియా కప్ 2023 టోర్నీ ఆగష్టు 30 నుంచి ప్రారంభంకానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో సెప్టెంబర్ 2న దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది.