పడనోళ్లకు టికెట్లిస్తే మేమెట్ల పనిజేస్తం?

పడనోళ్లకు టికెట్లిస్తే మేమెట్ల పనిజేస్తం?

మన్నె కవిత, విజయరెడ్డికి టికెట్లు
ఇవ్వడంపై దానం గుస్సా
బొంతు శ్రీదేవికి ఇవ్వడంపై బేతి
సుభాష్ రెడ్డి, తలసాని అపోజ్
అంబర్ పేట టికెట్ కేటాయింపుపై
కాలేరు వెంకటేష్ అసంతృప్తి

గ్రేటర్ హైదరాబాద్ టికెట్ల కేటాయింపు తీరు టీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేల్లో అగ్గి రాజేసింది. పార్ టీ నిర్ణయంపై వారు గుర్రుగా ఉన్నారు. తాము సూచించిన వ్యక్తులకు కాకుండా, వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఎట్ల గెలుస్తారో చూస్తామని తమ సన్నిహితుల వద్ద సదరు ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నట్టు తెలిసింది. మూడు విడతల్లో క్యాండిడేట్ల లిస్టును టీఆర్ఎస్ విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసిన చివరి లిస్టులో చాలా మంది సిట్టింగ్ లను మార్చారు. సిట్టింగ్ లను మార్చడంపై కొందరు… తమకు గిట్టని సిట్టింగ్ లకే టికెట్
ఇవ్వడంపై ఇంకొందరు ఎమ్మెల్యేలు గరమైతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్
మన్నె కవితకు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ టీఆర్ ఎస్ పెద్దలకు పలుసార్లు విజ్ఞప్తి చేసినట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యంతరాన్ని పట్టించుకోకుండా సిట్టింగ్ కు టికెట్ ఇవ్వడంపై నాగేందర్ గుర్రుగా ఉన్నారని ఆయన సన్ని హితులు అంటున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని కూడా దానం టీం వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

చర్లపల్లి టికెట్​ను మేయర్​ బొంతు రామ్మోహన్​ భార్య బొంతు శ్రీదేవికి ఇవ్వడాన్ని ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి వర్గంతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఆమెకు ఇవ్వొద్దని సుభాష్​రెడ్డి కొన్ని రోజులుగా ఆందోళనలు చేయించినట్టు నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. సుభాష్​రెడ్డి భార్య స్వప్న హబ్సిగూడ సిట్టింగ్ కార్పొరేటర్ గా ఉన్నారు. చర్లపల్లిలో మేయర్ భార్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే, హబ్సిగూడలో సుభాష్​రెడ్డి భార్య టికెట్​కు కోత పెడ్తామని టీఆర్​ఎస్​ పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో, చివరికి ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోయారని టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు.

ఎమ్మెల్యే మాత్రం శ్రీదేవికి వ్యతిరేకంగా పని చేయాలని తన కేడర్ ను ఆదేశించినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. బొంతు శ్రీదేవికి టికెట్ ఇవ్వడంపై మంత్రి తలసాని వర్గం కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. శ్రీదేవి, తలసాని ఇద్దరూ యాదవ్​ కమ్యూనిటీకి చెందినవాళ్లు. ఇప్పటికే సిటీలో యాదవ్​ కమ్యూనిటీకి ఐకాన్​గా తలసాని ఉన్నారని, శ్రీదేవి కార్పొరేటర్​గా గెలిస్తే కమ్యూనిటీలో పెద్ద లీడర్​గా ఎదుగుతారని, ఇది తలసానికి సమస్యగా మారుతుందనే ఆయన వర్గం వ్యతిరేకిస్తున్నదని లీడర్లు చెప్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో సికింద్రాబాద్​ ఎంపీ టికెట్​ కోసం శ్రీదేవి ప్రయత్నించినా చివరి నిమిషంలో తన కొడుకుకు తలసాని ఇప్పించుకున్నారు. మరోవైపు నాచారం టికెట్​ను కూడా ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి వ్యతిరేకించిన వ్యక్తికే కేటాయించారని, ఆ క్యాండిడేట్​ ప్రచారానికి కూడా ఎమ్మెల్యే వర్గం సహకరించకపోవచ్చని లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంబర్ పేట ఎమ్మెల్యే సహకరించేనా?

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ భార్య పద్మ గోల్నాక సిట్టింగ్ కార్పొరేటర్​గా ఉన్నారు. ఆమెకు మళ్లీ టికెట్ ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. కానీ అక్కడ మంత్రి హరీశ్ రావు అనుచరుడు దూసరి శ్రీనివాస్ భార్య లావణ్యకు టికెట్ ఇచ్చారు. దీంతో పార్టీ క్యాండిడేట్​ గెలుపు కోసం వెంకటేశ్​ కృషి చేస్తారా? అనే చర్చ లీడర్లలో నడుస్తోంది.