
నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాలపై టీవీ ఛానళ్లకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. రక్తం మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫొటోలు, భయంగొలిపే వీడియోలు, మృతదేహాలను యథావిధిగా రిపోర్ట్ చేయొద్దని సూచించింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
‘‘టీవీ ఛానళ్లు మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫొటోలను దగ్గర్నుంచి చూపిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, పెద్దలపై జరిగిన దాడులకు సంబంధించిన పుటేజ్లను అలాగే ప్రసారం చేస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి వీడీయోలను తీసుకుని బ్లర్ చేయకుండానే ప్రసారం చేస్తున్నారు. ఇలాంటివి రిపోర్ట్ చేయడం హృదయవిదారకం. ప్రోగ్రామ్ కోడ్ రూల్స్కు విరుద్ధం. ఇటువంటి పుటేజ్లు ప్రేక్షకులను కలవరపాటుకు గురిచేస్తాయి. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా బాధితల గోప్యతకు భంగం కలుగుతుంది’’ అని పేర్కొంది.