హైదరాబాద్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా గిరిజనోత్సవాలను నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో చేపట్టిన కార్యక్రమాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన ఆర్థిక సహకార సంస్థ ట్రైకార్ ద్వారా లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేశారు. అనంతరం ఎరుకల సాధికారత పథకం (యెస్)ను మంత్రి ప్రారంభించారు.
రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో చదువుకునే ఎస్టీ స్టూడెంట్లకు హాస్టళ్లను కట్టించే విషయంపై ఆయా వర్సిటీల వీసీలతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా గిరిజన కళాకారులు, హస్త కళాకారులు ప్రదర్శించిన పెయింటింగ్స్, మాస్కులు, ఎంబ్రాయిడరీ వస్తువులు, ఆభరణాల స్టాల్స్‌ను సత్యవతి రాథోడ్ పరిశీలించారు. గిరిజన సంప్రదాయ వంటకాల ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జేడ్చోంగ్తు, శాఖ స్పెషల్సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
