పైసల పంపిణీ షురూ! .. ఓటర్లకు తాయిలాలు పంచుతున్న అభ్యర్థులు

పైసల పంపిణీ షురూ!  .. ఓటర్లకు తాయిలాలు పంచుతున్న అభ్యర్థులు
  • ఓటర్లకు తాయిలాలు పంచుతున్న అభ్యర్థులు
  • ఫస్ట్​ ఇన్​స్టాల్​మెంట్​గా ఓటుకు కొంత ఇస్తున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు ఇంకో 12 రోజుల గడువుండగానే పైసల పంపిణీ మొదలైంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడం షురూ చేశారు. ఓట్లను గ్యారంటీ చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు మొదటి విడతగా కొంత నగదు ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు నియోజకవర్గాన్ని బట్టి రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఫస్ట్​ఇన్​స్టాల్​మెంట్​గా ఇస్తున్నారు. పోలింగ్ ముందు మళ్లీ కొంత ఇస్తమని తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.

చాలా చోట్ల అభ్యర్థులు ముందస్తు పోల్​మేనేజ్​మెంట్​కు తెరతీశారు.వారి ముఖ్య అనుచరులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఒక పార్టీ అభ్యర్థి అనుచరుడు శనివారం పోలీసులకు పట్టుబడ్డారు. ఎక్కువ మంది అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తుండగా.. దావత్​లు మాత్రం బాహాటంగానే ఏర్పాటు చేస్తున్నారు.

త్రిముఖ పోటీ ఉన్న చోట ఇంకా ఎక్కువగా

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న నిర్వహించేందుకు ఎలక్షన్​కమిషన్​అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడోసారి గెలిచి హాట్రిక్​కొట్టాలనే ప్రయత్నంలో అధికార బీఆర్ఎస్​ఉండగా.. కేసీఆర్​ను గద్దె దించేది తామేనని కాంగ్రెస్, బీజేపీ చెప్తున్నాయి. మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ఓటు విలువ ఎక్కువగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ముందస్తుగా ఓటర్లను రీచ్​అయ్యేందుకు పోల్​మేనేజ్​మెంట్​పై దృష్టి సారించారు. గ్రేటర్​శివారులోని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న కొందరు క్యాండిడేట్లు ఓటర్లకు నగదు, గిఫ్టుల పంపిణీని షురూ చేశారు. గేటెడ్​కమ్యూనిటీలు, అపార్ట్​మెంట్లు, కాలనీల్లో గెట్​టు గెదర్​లతో ఓటర్లకు గ్రాండ్​గా పార్టీలు ఇస్తున్నారు. కాస్ట్​లీ లిక్కర్​సర్వ్​చేస్తున్నారు. పనిలో పనిగా చిన్నపాటి గిఫ్ట్​లను చేతిలో పెడుతున్నారు. బస్తీలు, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు లిక్కర్ (క్వార్టర్​బాటిళ్లు) పంపిణీ చేస్తూ.. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అడ్వాన్స్​గా ఇస్తున్నారు.

పోలింగ్​కు ముందు మరికొంత నగదు ఇస్తామని, ఈసారి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్​జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ నగదు పంపిణీ మొదలు పెట్టారు. ఒక్కో ఓటర్​కు అడ్వాన్స్​గా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ముట్టజెప్తున్నారు. అలాగే లిక్కర్ బాటిళ్లు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్​నియోజకవర్గాల్లోనూ డబ్బు పంపిణీని మొదలుపెట్టారు. మిగతా జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దావత్​లు షురూ చేశారు.