
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం 9 జిల్లాల్లో అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల స్కీమ్‌ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కిట్ల పంపిణీ ప్రారంభించనున్నామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని హెల్త్ ఆఫీసర్లు, కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. మంగళవారం ఆఫీసర్లతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 24 జిల్లాలోని 111 కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. కిట్లు తీసుకోవడానికి వచ్చే గర్భిణులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌లో గతేడాది నుంచి కిట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కిట్లలో పోషకాహార పదార్థాలు అందిస్తున్నామన్నారు. కంటి వెలుగు రెండో దశలో ఇప్పటివరకు కోటిన్నర మందికి స్ర్కీనింగ్ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. 21.46 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 13 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అందజేశామన్నారు. పనులు పూర్తయిన బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.