వైట్ హౌస్‎లో ఘనంగా దీపావళి వేడుకలు

వైట్ హౌస్‎లో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా, బ్రిటన్‎లలో దీపావళి వేడుకలు గ్రాండ్‎గా జరుగుతున్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావలి జరుపుకుంటున్న హిందు, సిక్కు, జైన్, బౌధ్ధులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. వైట్ హౌస్‎లో ఆయన ఫస్ట్ లేడీ జిల్ బిడెన్‎తో కలిసి దీపాలు వెలిగించారు. దీపావళి పండుగ చేసుకుంటున్న వారందరికీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‎లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్‎పై యానిమేషన్‎తో సృష్టించిన దీపావళి థీమ్‎ను ప్రదర్శించారు. హడ్సన్ నదిపై కళ్లు చెదిరేలా ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాషింగ్టన్‎లో కూడా పెత్త ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ పాల్గొన్నారు. దీపాలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. చికాగోకు చెందిన కాంగ్రెస్ మెన్ డ్యానీ డేవిస్ కూడా స్థానికంగా వేడుకలు నిర్వహించారు.

‘చీకటిలో కూడా జ్ఞానం, తెలివి, సత్యం ఉన్నాయని దీపావళి వెలుగు మనకు గుర్తు చేస్తుంది. విభజన నుంచి ఐక్యత.. నిరాశ నుంచి ఆశ పుడతాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులు, సిక్కులు, జైనులు మరియు బౌద్ధులకు పీపుల్స్ హౌస్ నుంచి దీపావళి శుభాకాంక్షలు’ అని బైడెన్ ట్వీట్ చేశారు.

అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా బ్రిటన్‎లో పండుగ చేసుకుంటున్న అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కఠిన పరిస్థితుల తర్వాత చేసుకుంటున్న ఈ దీపావళి చాలా ప్రత్యేకమని ఆయన అన్నారు.