జగిత్యాలలలో డీజే సౌండ్ల బీభత్సం.. కూలిన దుకాణం స్లాబ్‌

జగిత్యాలలలో డీజే సౌండ్ల బీభత్సం.. కూలిన దుకాణం స్లాబ్‌

జగిత్యాల: డీజే సౌండ్లకు వచ్చిన వైబ్రేషన్ల కారణంగా ఓ దుకాణం స్లాబ్‌ కూలినట్లు సమాచారం. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పాత పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి ధ్వంసమై భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వెల్లడించాడు.

కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రమేష్‌ టైలరింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, డీజే సౌండ్ల వైబ్రేషన్ల కారణంగా తన దుకాణం స్లాబ్‌ కూలిపోయినట్లు సమాచారం. దీంతో షాపులోని టైలరింగ్‌ సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో రూ.50 వేలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రమేష్‌ తెలిపాడు.

రాత్రి సమయంలో ఘటన.. తప్పిన ప్రాణాపాయం

ఈ ఘటన రాత్రి సమయంలో జరగడంతో ప్రాణాపాయం తప్పిందని రమేష్‌ పేర్కొన్నాడు. పగటి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశాడు. డీజే సౌండ్ల తీవ్రత, వాటి వల్ల కలిగే వైబ్రేషన్లపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.