కిషన్ రెడ్డి నాయకత్వంలోనే .. పార్లమెంట్ ఎన్నికలకు పోతం: డీకే అరుణ

కిషన్ రెడ్డి నాయకత్వంలోనే .. పార్లమెంట్ ఎన్నికలకు పోతం: డీకే అరుణ
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ

హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కిషన్ రెడ్డి నాయకత్వంలోనే బీజేపీ ఎదుర్కొంటుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. దేశంలో మరోసారి అధికారమే లక్ష్యంగా తెలంగాణలో ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతోందన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, ఈ విషయం ప్రొటెం స్పీకర్ ఎన్నికతో మరోసారి స్పష్టమైందని ఆరోపించారు. తెలంగాణలో లోపాయికారి ఒప్పందంతో ఉన్న కొన్ని పార్టీలు బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ.. బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేశాయని విమర్శించారు. 

తెలంగాణలో మార్పు రావాలనే ఒక ఆలోచన ప్రజలకు కల్పించిందే బీజేపీ అన్నారు. రాష్ట్రంలో సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచి భవిష్యత్తు బీజేపీదేననే  భరోసా ప్రజలు ఇచ్చారన్నారు. ‘‘2018  ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ రెట్టింపు పుంజుకుంది. 8 సీట్లను గెలుచుకుంది. చాలాచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్​కు గట్టిపోటీ ఇవ్వడంతో పాటు బలమైన అభ్యర్థులను ఓడించడంలోనూ బీజేపీ కీలక పాత్ర పోషించింది.  మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించి బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో మట్టి కరింపించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ఈ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి”అని అరుణ అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని  కాబోతున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 403 స్థానాలను గెలవబోతోందని ఆమె పేర్కొన్నారు.