
నారాయణపేట, వెలుగు: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ పిట్ట అని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏదో సాధించామని ట్విట్టర్‌లో పిట్ట పలుకులు పలుకుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వరా అని అడగడం తన ఆవగాహన రాహిత్యాన్ని తెలుపుతోందన్నారు.
మొదట రైల్వే లైన్లను విద్యుదీకరణ చేయాలని.. ఆ తరువాత బుల్లెట్ ట్రైన్ గురించి అడగాలన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుపై కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా… కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఉపాధి హామీకి 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని వాటిలో చాలా వరకు నిధులు మళ్లించారని అన్నారు. మున్సిపల్ వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని, తమ పార్టీ అభ్యర్థుల విజయానికి అనుకూలంగా వాటిని విభజించారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు ప్రారంభించారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే పెంచిన పెన్షన్లు ఎన్నికల ముందు ఇస్తున్నారన్నారు. యువత బీజేపీలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారని,రాష్ట్రంలో అత్యధిక మున్సిపాల్టీలను కైవసం చేసుకుంటుందన్నారు.