మరోసారి కేసీఆర్ ​సీఎం అయితే.. తెలంగాణకు భవిష్యత్ ​ఉండదు: డీకే అరుణ

మరోసారి కేసీఆర్ ​సీఎం అయితే.. తెలంగాణకు భవిష్యత్ ​ఉండదు: డీకే అరుణ
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
  • మోదీ నాయకత్వంలో భారత్​అగ్రగామిగా నిలిచింది
  • కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

కల్వకుర్తి/ఆమనగల్లు, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. సోమవారం కల్వకుర్తి టౌన్​లో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి విశాల్ కౌశల్ స్కీం​ద్వారా దేశంలోని కోట్ల మంది విశ్వకర్మలకు వడ్డీ లేని రుణం అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి వేల కోట్లు ఇస్తున్నా.. సీఎం కేసీఆర్ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్​కాదన్నారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే, అందులో 50 పైసలు మాత్రమే ప్రజలకు చేరిందని గతంలో రాజీవ్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మోదీ హయాంలో రూపాయికి రూపాయి ప్రజలకు చేరుతోందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కేసీఆర్​ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ నాశనమైందని, మరోసారి సీఎం అయితే తెలంగాణకు భవిష్యత్​లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీమంత్రి చిత్తరంజన్ దాస్, నేతలు బండేల రాంచంద్రారెడ్డి, యెన్నం శేఖర్ రెడ్డి, దుర్గాప్రసాద్, శేఖర్ రెడ్డి, రాఘవేందర్, నరసింహ, కండె హరిప్రసాద్, చంద్రశేఖర్  పాల్గొన్నారు. అంతకు ముందు రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాల్లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఆహ్వానించారు. కడ్తాల్  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం కడ్తాల్  నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ కండే హరిప్రసాద్  పాల్గొన్నారు.